ఆంధ్రప్రదేశ్ భక్తుల బస్సు ప్రమాదం: కేరళలో 11 మంది గాయాలు – త్రికలత్తూర్ వద్ద జరిగిన ఘటన వివరాలు

ఆంధ్రప్రదేశ్‌ నుంచి శబరిమలకు వెళ్తున్న యాత్రికుల బస్సు, కేరళలోని మావత్తుపుళ సమీపంలోని త్రికలత్తూర్ వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 11 మంది అయ్యప్ప భక్తులు గాయపడ్డారని స్థానిక పోలీసులు తెలిపారు.

పోలీసుల సమాచారం ప్రకారం, ఏపీకి చెందిన శ్రీ దుర్గా ట్రావెల్స్‌ ప్రైవేట్‌ బస్సులో ఇద్దరు చిన్నారులు సహా మొత్తం 33 మంది అయ్యప్ప భక్తులు శబరిమల యాత్రకు బయలుదేరారు. గురువారం తెల్లవారుజామున బస్సు త్రికలత్తూర్‌లోని ఎంసీ రోడ్డుపై ప్రయాణిస్తున్న సమయంలో ఎదురుగా వేగంగా వచ్చిన లారీ బస్సును ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో పాలక్కాడ్‌కు చెందిన లారీ డ్రైవర్ రెమీ, బస్సు డ్రైవర్ గౌతమ్‌కుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. బస్సు ముందు సీట్లలో కూర్చున్న భక్తులు బాలాజీ, వెంకటేశ్, మోహన్ బాబు, గోవింద్, చంద్రారెడ్డి, శ్రీనివాసులు, ఉమాపతి, ఉదయ్‌కుమార్, దీపికలకు స్వల్ప గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను అలువాలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. యాత్రికులంతా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారేనని అధికారులు వెల్లడించారు.

తప్పిన పెను ప్రమాదం

లారీ బస్సును తీవ్రంగా ఢీకొనడంతో బస్సు డ్రైవర్‌ నియంత్రణ కోల్పోయి పక్కనే ఉన్న హైటెన్షన్‌ విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టాడు. ఘటన జరిగిన వెంటనే అక్కడున్న స్థానికులు పోలీసులకు, విద్యుత్‌ శాఖకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో అధికారులు వెంటనే విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు.

ఈ ప్రమాదం కారణంగా ఆ మార్గంలో ఉదయం వరకూ తీవ్ర ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. అనంతరం పోలీసులు క్రేన్‌ సాయంతో లారీని రహదారి నుంచి తొలగించి ట్రాఫిక్‌ను సాధారణ స్థితికి తెచ్చారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి