హైదరాబాద్‌లో కో-లివింగ్ కేంద్రాల్లో డ్రగ్స్ దందా.. యువతపై పెరుగుతున్న ముప్పు

హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో కో-లివింగ్ కల్చర్ వేగంగా విస్తరిస్తోంది. ఉద్యోగాల కోసం, విద్య కోసం నగరానికి వచ్చే యువత ఈ సౌకర్యాలను విస్తృతంగా వినియోగిస్తోంది. తక్కువ అద్దెకు, అన్ని ఆధునిక సదుపాయాలతో ఉండే కో-లివింగ్ గదులు వారికి సులభమైన నివాస మార్గాన్ని అందిస్తున్నాయి. అయితే ఈ మధ్యకాలంలో ఈ కో-లివింగ్ వసతి గృహాలు కొన్ని చోట్ల డ్రగ్స్ అక్రమ రవాణా, వినియోగానికి కేంద్రాలుగా మారుతున్నట్లు గుర్తించడం ఆందోళన కలిగిస్తోంది.

కో-లివింగ్ కాన్సెప్ట్ పాశ్చాత్య దేశాల నుంచి మన దేశానికి వచ్చిన ఆధునిక ట్రెండ్. ఒకే భవనంలో, ఒక్కో రూమ్ లేదా ఫ్లాట్‌లో పలు వ్యక్తులు కలిసి నివసించడం, అద్దెతో పాటు ఇంటర్నెట్, కిచెన్, హౌస్ కీపింగ్ వంటి సదుపాయాలను పంచుకోవడం ఈ విధానంలో సాధారణం. ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు, పూణే వంటి ఐటీ నగరాల్లో పనిచేసే యువ నిపుణులు దీనిని విస్తృతంగా అనుసరిస్తున్నారు.

ఇదిలా ఉండగా, ఇటీవల గచ్చిబౌలి టీఎన్‌జీఓ కాలనీలోని కో-లివింగ్ గదులపై ఎస్ఓటీ పోలీసులు మెరుపు దాడులు చేశారు. ఆ దాడుల్లో డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తున్న 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఆరుగురు డ్రగ్స్ సరఫరాదారులు, ఆరుగురు వినియోగదారులని పోలీసులు తెలిపారు.

పోలీసుల విచారణలో కర్ణాటకకు చెందిన గుత్తా తేజ అనే వ్యక్తి, ఒక నైజీరియన్ సహకారంతో డ్రగ్స్‌ను స్మగ్లింగ్ చేసి హైదరాబాద్ యువతకు సరఫరా చేస్తున్నట్లు తేలింది. ఎండీఎంఏ, గంజాయి, ఇతర రకాల నిషేధిత మత్తు పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

డ్రగ్స్ సరఫరా కేవలం కో-లివింగ్ గదుల వరకే పరిమితం కాకుండా సాధారణ నివాస ప్రాంతాలకూ విస్తరించిందని పోలీసులు వెల్లడించారు. తాజాగా ముషీరాబాద్‌లో జాన్‌పాల్ అనే వైద్యుడి ఇంట్లో పోలీసులు దాడులు చేసి రూ.3 లక్షల విలువ చేసే డ్రగ్స్‌ను పట్టుకున్నారు.

విచారణలో ప్రమోద్, సందీప్, శరత్ అనే ముగ్గురు వ్యక్తులు దిల్లీ, బెంగళూరు ప్రాంతాల నుంచి డ్రగ్స్ తెప్పించి జాన్‌పాల్ ఇంట్లో నిల్వ ఉంచి విక్రయిస్తున్నట్లు బయటపడింది. డ్రగ్స్‌ను ఉంచినందుకు ఆ వైద్యుడికి ఉచితంగా వాటిని అందిస్తున్నారని పోలీసులు తెలిపారు. వారి ఇంట్లో ఓజీకుష్, కొకైన్, హాష్ ఆయిల్ వంటి ప్రమాదకరమైన డ్రగ్స్ లభ్యమయ్యాయి.

ఈ వరుస దాడులు హైదరాబాద్‌లో డ్రగ్స్ వ్యాప్తి ఆందోళనకర స్థాయికి చేరిందని సూచిస్తున్నాయి. యువత, ఐటీ ప్రొఫెషనల్స్ లక్ష్యంగా మారిన ఈ దందాను అరికట్టేందుకు పోలీసులు, ఎక్సైజ్ శాఖలు సమన్వయంతో మరింత కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి