కృష్ణా జిల్లా నాగాయలంకలో చోటుచేసుకున్న ఓ అరుదైన సంఘటన స్థానికులను, భక్తులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. పవిత్ర కార్తిక మాసంలో రామలింగేశ్వర స్వామి ఆలయ పరిసరాలకు వందలాది నీటి పాములు చేరుకోవడం అందరినీ విస్మయానికి గురి చేసింది. ఆలయానికి ఆనుకుని ప్రవహిస్తున్న కృష్ణా నదిలో పాములు గుంపులుగా సంచరించే దృశ్యాలు చూసినవారిని అబ్బురపరుస్తున్నాయి.
కృష్ణా నదీ తీరంలోని ఈ పురాతన శివాలయం వద్ద ప్రతి సంవత్సరం కార్తిక మాసంలో పాములు కనిపించడం సాధారణమేనని స్థానికులు చెబుతున్నారు. అయితే ఈసారి వాటి సంఖ్య మరింత ఎక్కువగా ఉండటంతో ఈ ఘటన ప్రత్యేక చర్చనీయాంశంగా మారింది. ఆలయం వెనుక ఉన్న నదీ ప్రవాహంలో ఈ పాములు స్వేచ్ఛగా సంచరిస్తూ కనిపిస్తున్నాయి.
ఇది అంతా శివయ్య మహిమేనని భక్తులు విశ్వసిస్తున్నారు. “ప్రతి కార్తిక మాసంలో స్వామివారి దర్శనం కోసం పాములు వస్తాయి. ఈసారి ఇంత ఎక్కువ సంఖ్యలో రావడం శివుడి అనుగ్రహ సూచనే” అని ఒక భక్తుడు తెలిపారు. ఈ అద్భుత దృశ్యాలను చూడటానికి సమీప గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుతున్నారు.
సంబంధిత వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఈ ఆలయం గురించి రాష్ట్రవ్యాప్తంగా చర్చ మొదలైంది. భక్తి, ప్రకృతి కలిసిన ఈ అసాధారణ దృశ్యం అందర్నీ ఆకట్టుకుంటోంది. సాయంత్రం అయ్యే కొద్దీ మరిన్ని పాములు కనిపించే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు.



