మోదీ తర్వాత ప్రధాని ఎవరు? – ‘రాయిటర్స్’ కథనం రాజకీయ వర్గాల్లో సంచలనం

  • నరేంద్ర మోదీ తరువాత భారతదేశ ప్రధానిగా ఎవరు బాధ్యతలు చేపడతారు?
  • వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి ఎన్డీఏ ప్రధాని అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు అవతరించగలరా?
  • లేదా ఆయన కుమారుడు నారా లోకేష్‌కు ఆ అవకాశం దక్కుతుందా?

ఈ ప్రశ్నలన్నింటికీ బీజం వేసింది ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ ప్రచురించిన తాజా కథనం. 2025 ముగింపు దశకు చేరుతున్న వేళ, భవిష్యత్ రాజకీయ పరిణామాలపై ప్రపంచ మీడియా ప్రత్యేక విశ్లేషణలకు ప్రాధాన్యం ఇస్తున్న క్రమంలో ఈ కథనం దేశ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ పేర్లను ప్రధాని పదవితో జత చేయడం రాజకీయంగా సంచలనంగా మారింది. ప్రస్తుతం రాయిటర్స్ ప్రతినిధి కథనం సోషల్ మీడియా సహా రాజకీయ వేదికల్లో విస్తృత చర్చకు దారితీస్తోంది.


వచ్చే ఎన్నికల నాటికి మోదీ తప్పుకుంటారా?

నరేంద్ర మోదీ భారతదేశానికి మూడోసారి ప్రధాని అయ్యారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా సుదీర్ఘ కాలం పాలించిన ఆయన 2014లో తొలిసారి ప్రధాని పదవిని చేపట్టారు. 2019లో పూర్తి మెజారిటీతో రెండోసారి విజయం సాధించారు. అయితే 2024 ఎన్నికల్లో బీజేపీకి స్వతంత్ర మెజారిటీ దక్కలేదు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం పార్టీ కీలకంగా మద్దతు ఇచ్చింది. టీడీపీకి 16 ఎంపీ సీట్లు లభించగా, చంద్రబాబు నాయుడు, బిహార్ సీఎం నితీష్ కుమార్ మద్దతుతో మోదీ మూడోసారి ప్రధాని అయ్యారు.

రాయిటర్స్ కథనం ప్రకారం, వచ్చే ఎన్నికల నాటికి నరేంద్ర మోదీ రాజకీయంగా మూడు దశాబ్దాల ప్రయాణాన్ని పూర్తిచేస్తారని, వయసు, రాజకీయ వ్యూహాల కారణంగా మరోసారి ప్రధాని పదవికి ఆసక్తి చూపకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలా మోదీ తప్పుకుంటే ఆయన స్థానంలో ఎవరు అనే ప్రశ్న సహజంగానే తెరపైకి వచ్చింది.

ఈ క్రమంలో అమిత్ షా, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ పేర్లు అర్హులుగా కథనంలో ప్రస్తావనకు వచ్చాయి. అయితే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేరు బలమైన ఎంపికగా ఉన్నప్పటికీ, ఆయనను పక్కనపెట్టి ఫడ్నవిస్ పేరును ప్రాధాన్యం ఇవ్వడం రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.


కాంగ్రెస్ విషయంలో కొత్తదేమీ లేదు

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రధాని పదవికి రాహుల్ గాంధీ సహజ ఎంపికనే అని రాయిటర్స్ పేర్కొంది. ఇది రాజకీయంగా పెద్దగా ఆశ్చర్యకరం కాదు. కాంగ్రెస్ అగ్రనేతగా రాహుల్ గాంధీ ఉన్నారు, పార్టీలో ఆయనకు విస్తృత ఆమోదం కూడా ఉంది. ఆయన తరువాత స్థానం ప్రియాంక గాంధీదేనని విశ్లేషణలో పేర్కొన్నారు. గాంధీ కుటుంబానికి చెందిన వారే కావడం వల్ల ఆ పదవికి అడ్డంకులు ఉండవని కథనం స్పష్టం చేసింది.

అయితే ప్రస్తుత రాజకీయ వాస్తవాలు చూస్తే కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు బలహీనపడుతోంది. ఆ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందన్న నమ్మకం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తక్కువగానే ఉంది. అయినప్పటికీ రాజకీయాల్లో ఎప్పుడూ అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటాయని పూర్తిగా విస్మరించలేమన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.


మిత్రపక్షాల కోణంలో చంద్రబాబు – లోకేష్

అత్యంత ఆసక్తికరమైన అంశం మాత్రం బీజేపీ కాకుండా మిత్రపక్షాలకు ప్రధాని పదవి దక్కే అవకాశంపై రాయిటర్స్ చేసిన విశ్లేషణ. ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ పేర్లు ప్రస్తావనకు రావడం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది.

గతంలో సంకీర్ణ ప్రభుత్వాల సమయంలో ఐకే గుజ్రాల్, హెచ్‌డీ దేవెగౌడ లాంటి నేతలు ప్రధాని పదవులు చేపట్టారు. అప్పట్లో వారు ప్రాతినిధ్యం వహించిన జనతా కుటుంబ పార్టీలు దేశవ్యాప్తంగా బలమైన ఉనికిని కలిగి ఉండేవి. అయితే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్‌లోని 25 పార్లమెంట్ స్థానాలకు మాత్రమే పరిమితమైంది.

ఇంకొక కీలక అంశం చంద్రబాబు వయస్సు. 2029 ఎన్నికల నాటికి ఆయన వయస్సు సుమారు 79 సంవత్సరాలు ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రధాని బాధ్యతలు చేపడతారన్న వాదనపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక నారా లోకేష్ విషయంలో అయితే మరిన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బీజేపీలోనే పలువురు బలమైన జాతీయ స్థాయి నేతలు ఉన్న సమయంలో, లోకేష్‌కు ప్రధాని పదవి ఎలా దక్కుతుందన్నది రాజకీయంగా అతిశయోక్తిగా కనిపిస్తోంది.

అయితే ఢిల్లీలో చంద్రబాబు, లోకేష్‌లకు ప్రాధాన్యం పెరుగుతోందన్నది వాస్తవం. తెలుగుదేశం పార్టీని నమ్మదగిన మిత్రుడిగా కేంద్ర బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. ఈ విశ్వాసమే రాయిటర్స్ కథనంలో వారి పేర్లు ప్రస్తావనకు రావడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ప్రస్తుతానికి అంతకుమించిన స్పష్టమైన రాజకీయ ఆధారాలు కనిపించడంలేదు.


మొత్తానికి, రాయిటర్స్ కథనం రాజకీయంగా ఆసక్తికరమైన ఊహాగానాలను ముందుకు తెచ్చినప్పటికీ, ఇవి ఇప్పటివరకు విశ్లేషణ స్థాయిలోనే ఉన్నాయని, భవిష్యత్ రాజకీయ సమీకరణలే తుది నిర్ణయాన్ని వెల్లడిస్తాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి