గుంటూరు జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. అమరావతి పరిధిలోని మందడం గ్రామంలో నిర్వహించిన అధికారిక సమావేశం విషాదాంతంగా మారింది. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సమక్షంలో జరుగుతున్న చర్చల మధ్య ఓ రైతు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. రోడ్డు నిర్మాణ పనుల నేపథ్యంలో భూములు, ఇళ్లు కోల్పోతున్న నిర్వాసితుల సమస్యలపై చర్చ జరుగుతుండగానే ఈ దురదృష్టకర ఘటన జరిగింది. మృతుడిని ఎం. రాములు (68)గా గుర్తించారు.
వివరాల్లోకి వెళితే.. రాజధాని ప్రాంతంలో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనుల కారణంగా భూములు కోల్పోతున్న రైతులతో మంత్రి నారాయణ మందడం గ్రామంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రైతు రాములు తన ఆవేదనను మంత్రికి వివరించారు. ప్లాట్లను ముక్కలుగా విభజించి కేటాయించడం వల్ల తమకు తీవ్ర నష్టం జరుగుతోందని, ఇది తమ గొంతు కోసినట్లేనని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మంత్రి సూచన మేరకే వాగు సమీపంలో తమకు ప్లాట్లు కేటాయించారని ఆరోపించారు.
తాను రోడ్డు నిర్మాణం కోసం ఇంటిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని, అయితే ఇళ్లు కోల్పోయే రైతులందరికీ తాళ్లయపాలెం సమీపంలో సీడ్ యాక్సెస్ రోడ్డుకు ఆనుకుని ఒకేచోట భూములు కేటాయించాలని రాములు స్పష్టంగా డిమాండ్ చేశారు. తన సమస్యను భావోద్వేగంతో వివరించిన కొద్దిసేపటికే ఆయన కూర్చున్న కుర్చీలోనే అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు.
అక్కడున్న అధికారులు, ఇతర రైతులు వెంటనే స్పందించి సీపీఆర్ చేశారు. వెంటనే మంత్రి కాన్వాయ్‌లోని వాహనంలోనే రాములును గుంటూరులోని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. మార్గమధ్యంలోనే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
ఈ ఘటనతో మందడం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన సమావేశంలోనే రైతు ప్రాణాలు కోల్పోవడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది. రైతుల సమస్యలు ఎంత తీవ్రమైనవో ఈ ఘటన మరోసారి స్పష్టంగా చాటిచెప్పింది.



