జీమెయిల్ వినియోగదారులకు గూగుల్ నుంచి శుభవార్త అందనుంది. ఎంతో కాలంగా యూజర్లు కోరుకుంటున్న ఒక కీలకమైన ఫీచర్‌ను గూగుల్ త్వరలో అమలులోకి తీసుకురానుంది. ఇకపై జీమెయిల్ యూజర్లు తమ ఈ-మెయిల్ ఐడీ (యూజర్ నేమ్)ను మార్చుకునే అవకాశం పొందనున్నారు. ప్రస్తుతం ఉన్న యూజర్ ఐడీపై అసంతృప్తిగా ఉన్న వారికి ఇది నిజంగా ఉపయోగకరమైన అప్డేట్గా చెప్పుకోవచ్చు.
అయితే, ఈ సదుపాయం ఇంకా అందరికీ ఒకేసారి అందుబాటులోకి రాలేదు. కొంతమంది యూజర్లకు మాత్రమే ప్రస్తుతం ఈ ఆప్షన్ కనిపిస్తున్నట్లు సమాచారం. పూర్తిస్థాయిలో అన్ని ఖాతాలకు ఈ ఫీచర్ అందుబాటులోకి రావడానికి ఇంకా కొంత సమయం పట్టే అవకాశముంది.
సాధారణంగా చాలా మంది జీమెయిల్ ఖాతా సృష్టించే సమయంలో సరైన ఆలోచన లేకపోవడం, లేదా నచ్చిన యూజర్ నేమ్‌లు అప్పటికే ఉపయోగంలో ఉండటం వంటి కారణాలతో ఏదో ఒక పేరుతో మెయిల్ ఐడీ క్రియేట్ చేసుకుంటారు. ఆ తర్వాత ఆ యూజర్ ఐడీని మార్చుకునే అవకాశం లేకపోవడంతో, ఇష్టం లేకపోయినా అదే మెయిల్ ఐడీని సంవత్సరాల తరబడి ఉపయోగించాల్సి వస్తోంది. ముఖ్యంగా పాత డేటా, మెయిల్స్, కాంటాక్ట్స్ కోల్పోవడం ఇష్టం లేక చాలామంది అదే ఖాతాను కొనసాగిస్తున్నారు.
ఈ సమస్యలన్నింటికీ పరిష్కారంగా గూగుల్ ఇప్పుడు యూజర్ నేమ్ మార్చుకునే వెసులుబాటును తీసుకువచ్చింది. గూగుల్ సపోర్ట్ పేజీలో ఈ కొత్త ఆప్షన్ కనిపించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఫీచర్ ద్వారా ఈ-మెయిల్ ఐడీ చివరలో ఉండే “@gmail.com” భాగాన్ని అలాగే ఉంచి, ముందు ఉన్న యూజర్ నేమ్‌ను మాత్రమే మార్చుకోవచ్చు. ముఖ్యంగా, యూజర్ నేమ్ మారినప్పటికీ ఖాతా మాత్రం పాత ఖాతాగానే కొనసాగుతుంది. డేటా, మెయిల్స్ అన్నీ యథాతథంగా ఉంటాయి.
అయితే, ఈ ఫీచర్‌కు కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. ఒకసారి యూజర్ నేమ్ మార్చుకున్న తర్వాత, మరోసారి మార్చుకోవడానికి కనీసం ఒక సంవత్సరం గ్యాప్ తప్పనిసరి. అంతేకాదు, ఒక జీమెయిల్ ఖాతాలో గరిష్ఠంగా మూడుసార్లు మాత్రమే యూజర్ నేమ్ మార్చుకునే అవకాశం ఉంటుందని గూగుల్ స్పష్టం చేసింది.


