మొంథా తుపాన్ దూసుకొస్తుంది – ఏపీ ప్రభుత్వం అలర్ట్, సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ వైపు మొంథా తుపాన్ వేగంగా దూసుకొస్తోంది. ఈ తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వాతావరణ పరిస్థితులు పూర్తిగా మారిపోనున్నాయి. వాతావరణ శాఖ తాజా నివేదిక ప్రకారం, ఆదివారం నుంచి ఈనెల 30వ తేదీ వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, పలు శాఖల మంత్రులు కలెక్టర్లు, ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు తుపానును ఎదుర్కోవడానికి తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు.

తుపాను తీవ్రత ఎక్కువగా ఉండే జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలని సీఎం సూచించారు. ప్రతి జిల్లా కలెక్టర్ ముందస్తు ప్రణాళికతో వ్యవహరించి, అవసరమైన వనరులు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. తీరప్రాంత ప్రజలకు తుపాను ప్రమాదాలపై అవగాహన కల్పించాలని సూచించారు. అదేవిధంగా, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను ముందుగానే సిద్ధం చేయాలని ఆదేశించారు.

రహదారులు, విద్యుత్, నీటిపారుదల, పంచాయతీరాజ్, పురపాలక శాఖలు అప్రమత్తంగా ఉండాలని సీఎం స్పష్టం చేశారు. తాగునీరు, విద్యుత్, పౌరసరఫరా, మొబైల్ సేవలు అంతరాయం లేకుండా చూడాలని సూచించారు.

ప్రజలకు సూచనలు

తుపాను తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ప్రజలకు పలు సూచనలు జారీ చేసింది. వాతావరణ హెచ్చరికలను అధికారిక మార్గాల ద్వారా తెలుసుకోవాలని, సోషల్ మీడియాలో వస్తున్న రూమర్లను నమ్మొద్దని సూచించింది.

లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారు విలువైన పత్రాలు, సర్టిఫికెట్లు, వస్తువులను వాటర్‌ప్రూఫ్ కవర్లలో భద్రపరచుకోవాలి. ఈనెల 30వ తేదీ వరకు తుపాను ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున వారానికి సరిపడా తాగునీరు, పాలు, పెరుగు, కూరగాయలు, పండ్లు, రెడీ టు ఈట్ ఆహారాన్ని సిద్ధంగా ఉంచుకోవాలని సూచించింది.

తుపాను సమయంలో 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున మొబైల్ ఫోన్లను పూర్తిగా చార్జ్ చేసుకోవాలి. కొవ్వొత్తులు, బ్యాటరీ లైట్లు, చార్జింగ్ ఎమర్జెన్సీ లైట్లు సిద్ధంగా ఉంచుకోవాలి.

భారీ గాలులు వీచే సమయంలో హోర్డింగ్‌లు, విద్యుత్ స్తంభాలు, చెట్లు వంటి వాటి సమీపంలో నిలవకూడదు. గ్రామీణ ప్రాంతాల్లో పశువులకు కట్టిన తాళ్లను వదిలేయాలి, అవి గాయపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

ప్రభుత్వం తుపాను ప్రభావాన్ని తగ్గించేందుకు అన్ని శాఖలను సిద్ధం చేసింది. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండి అధికారుల సూచనలను పాటించాలని సీఎం చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి