అమరావతి:
నేపాల్లో చిక్కుకున్న తెలుగు పౌరులను సురక్షితంగా రాష్ట్రానికి చేర్చేందుకు రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చేసిన ప్రయత్నాలు ఫలితమిస్తున్నాయి. మొత్తం 12 ప్రదేశాల్లో చిక్కుకున్న 217 మంది పౌరుల తరలింపుకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. వీరిలో 118 మంది మహిళలు, 99 మంది పురుషులు ఉన్నారు. విశాఖపట్నం నుండి 42మంది, విజయనగరం నుండి 34మంది, కర్నూలు నుండి 22మంది కాగా మిగతా వారు ఇతర జిల్లాలకు చెందినవారు.
ప్రస్తుతం 173మంది ఖాట్మాండూ పరిసరాల్లోని హోటళ్లలో తలదాచుకోగా, 22మంది హెటౌడాలో, 10మంది పోఖ్రాలో, 12మంది సిమికోట్లో చిక్కుకున్నారు. హెటౌడా వద్ద ఉన్న వారిని ఇప్పటికే మిలటరీ సహాయంతో బీహార్ సరిహద్దు మోతిహరి వైపు తరలించారు.
గురువారం ఖాట్మాండు నుండి ప్రత్యేక విమానం
ఖాట్మాండూ పరిసరాల్లో ఉన్న 173 మందిని తరలించేందుకు ఇండిగో-360 ప్రత్యేక విమానం గురువారం ఉదయం 10 గంటలకు ఢిల్లీ నుండి ఖాట్మాండు చేరుకోనుంది. కర్ఫ్యూ సడలింపు వెంటనే వారిని విశాఖపట్నం, విజయవాడకు తరలించే ఏర్పాట్లు జరిగాయి.
సిమికోట్లో చిక్కుకున్న 12 మందిని బుధ్ధ ఎయిర్ విమానం ద్వారా ఉదయం 9 గంటలకు యూపీ సరిహద్దు నేపాల్గంజ్కు తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. అవసరమైతే హెలికాప్టర్లు సిద్ధంగా ఉన్నాయి. అలాగే పోఖ్రాలో ఉన్న 10 మందిని 14 సీటర్ చార్టర్డ్ విమానం ద్వారా తరలించేందుకు చర్చలు జరుగుతున్నాయి. నేపాల్గంజ్కు చేరుకున్న తర్వాత వారిని రోడ్డుమార్గం ద్వారా లక్నో తరలించేందుకు యుపీ అధికారులతో సమన్వయం జరుగుతోంది.
బుధవారం ఉదయం నుంచే నిరంతర సమన్వయం
బాధితుల సమాచారం తెలిసిన వెంటనే మంత్రి లోకేష్ తన అనంతపురం పర్యటనను రద్దు చేసి ఉదయం 10 గంటలకు హుటాహుటిన సచివాలయానికి చేరుకున్నారు. అక్కడ ఆర్టీజీఎస్ వార్రూమ్లో ప్రధాన కార్యదర్శి విజయానంద్, సీనియర్ ఐఏఎస్ అధికారులు కార్తికేయ మిశ్రా, ముఖేష్ కుమార్ మీనా, కోన శశిధర్, అజయ్ జైన్, హిమాన్షు శుక్లా, జయలక్ష్మిలతో కలిసి సహాయక చర్యలపై చర్చించారు.
భారత విదేశాంగశాఖ, నేపాల్ ఎంబసీతో నిరంతర చర్చలు జరిపి విమానాశ్రయం తెరచిన వెంటనే పౌరులను తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 12మంది సిమికోట్ బాధితులను లక్నోకి తరలించి అక్కడినుంచి రాష్ట్రానికి రప్పించాలని సూచించారు.
బాధితులకు భరోసా
నేపాల్లోని హోటళ్లలో తలదాచుకున్న పౌరులతో మంత్రి లోకేష్ నిరంతరం వీడియో కాల్లు చేస్తూ వారికి ధైర్యం చెబుతున్నారు. ప్రతి రెండుగంటలకు ఒకసారి వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వారితో మాట్లాడుతున్నారు.
- విశాఖకు చెందిన సూర్యప్రభ, రోజారాణి, మంగళగిరికి చెందిన హేమసుందర్ రావు, నాగలక్ష్మిలతో మాట్లాడి భయపడవద్దని, క్షేమంగా తీసుకొస్తామని హామీ ఇచ్చారు.
- ఖాట్మాండు పశుపతినాథ్ దేవాలయం సమీపంలోని రాయల్ కుసుమ్ హోటల్లో ఉన్న 84మందికి, పశుపతి ఫ్రంట్ హోటల్లో తలదాచుకున్న 40మందికి భరోసా కలిగించారు.
- ఆందోళనకారులు దాడి చేసిన సంఘటనలో ప్రాణాలు దక్కించుకుని హోటల్ చేరుకున్నవారితో కూడా మాట్లాడారు.
మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఎపిఎన్ఆర్టి చైర్మన్ వేమూరి రవికుమార్, సిఇఓ కృష్ణమోహన్ సహాయక చర్యలను సమన్వయం చేస్తున్నారు. ఢిల్లీలోని ఎపి భవన్ అధికారులు కూడా బాధితుల తరలింపులో నిరంతరం భాగస్వాములవుతున్నారు.
👉 ఈ మొత్తం చర్యలతో, నేపాల్లో చిక్కుకున్న తెలుగు పౌరులు త్వరలోనే సురక్షితంగా స్వస్థలాలకు చేరుకునే అవకాశం కనిపిస్తోంది.



