వైసీపీ ఎమ్మెల్యేల అసెంబ్లీ బహిష్కరణ – జగన్ కీలక నిర్ణయాల దిశగా

ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు రాజకీయ వేడిని రగిలిస్తున్నాయి. సభలో అనేక అంశాలపై చర్చలు జరుగుతున్నప్పటికీ, వైసీపీ ఎమ్మెల్యేల గైర్హాజరు విశేష చర్చనీయాంశమైంది. ప్రతిపక్ష హోదా కల్పించకపోతే అసెంబ్లీకి హాజరుకావడం కుదరదనే నిర్ణయాన్ని పార్టీ అధినేత వైఎస్ జగన్ స్పష్టంగా ప్రకటించారు.

అయితే ప్రతిపక్ష హోదా ప్రజలు నిర్ణయించేది తప్ప ప్రభుత్వం ఇచ్చేదేం కాదని అధికార పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం వైసీపీ వద్ద ప్రతిపక్ష హోదా పొందడానికి కావలసిన ఎమ్మెల్యేల సంఖ్య లేకపోవడంతో స్పీకర్ కూడా ఆ అవకాశాన్ని తిరస్కరించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యేల గైర్హాజరుతో 11 మంది సభ్యులపై అనర్హత వేటు పడే అవకాశాలపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.

ఇక ఈ పరిణామాల నడుమ జగన్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని ప్రచారం బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా అధికారం కోల్పోయిన తరువాత ఆయన ఎక్కువ సమయం బెంగళూరులో గడుపుతున్నారు. వారానికి ఒకట్రెండు సార్లు మాత్రమే తాడేపల్లి ప్యాలెస్‌కు వచ్చి వెళ్లిపోతున్నారని సమాచారం. ఇటీవల అసెంబ్లీ సమావేశాల ముందు తాడేపల్లికి వచ్చి, ఎమ్మెల్యేలందరికి సభ బహిష్కరించాలని ఆదేశించిన తరువాత మళ్లీ బెంగళూరు వెళ్లిపోయారు.

సెప్టెంబర్ 24న జగన్ మరోసారి తాడేపల్లికి వచ్చి పార్టీ నేతలతో భేటీ కానున్నారని సమాచారం. ఇప్పటికే ఈ సమావేశానికి ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలను కూడా ఆహ్వానించారు. తప్పనిసరిగా హాజరుకావాలని కఠిన ఆదేశాలు జారీ చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సమావేశంలోనే కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు భావిస్తున్నారు.

రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, జగన్ ముందు రెండు మార్గాలు మాత్రమే ఉన్నాయి. ఒకటి — అసెంబ్లీకి హాజరై ప్రజా సమస్యలపై పోరాటం చేయడం. మరొకటి — ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి వెళ్లడం. అయితే జగన్ రెండో ఆప్షన్ వైపు మొగ్గు చూపుతున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఎందుకంటే ఆయన ఇప్పటికే ప్రతిపక్ష హోదా దక్కకపోతే అసెంబ్లీ గడప దాటనని, మళ్లీ ముఖ్యమంత్రిగానే సభలో అడుగుపెడతానని పునరుద్ఘాటించారు.

అందువల్ల జగన్ అసెంబ్లీకి వెళ్లకపోవడం సహజమని పార్టీ నేతలు భావిస్తున్నారు. పైగా రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్లడం ద్వారా “ప్రతిపక్ష హోదా నిరాకరించబడింది” అనే విషయాన్ని ప్రజల ముందుంచాలని వైసీపీ యోచనలో ఉందని చెబుతున్నారు. కోర్టు మార్గం కూడా ఫలితం ఇవ్వకపోవడంతో చివరికి ప్రజల తీర్పుకే వెళ్లాలని నిర్ణయించుకున్నట్టుగా కనిపిస్తోంది.

ఏదేమైనా సెప్టెంబర్ 24న జరిగే వైసీపీ సమావేశం రాజకీయాల్లో మరో సంచలనానికి నాంది పలికే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. జగన్ రాజీనామా చేసి ప్రజల్లోకి వస్తే, రాష్ట్ర రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోవడం ఖాయమని టాక్ వినిపిస్తోంది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి