వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి పాదయాత్రకు సిద్ధమవుతున్నట్లు సంచలన ప్రకటన చేశారు. ఏడాదిన్నర తర్వాత ఏలూరు నుంచే పాదయాత్రను ప్రారంభిస్తానని నియోజకవర్గ నేతల సమావేశంలో వెల్లడించారు. పాదయాత్ర ద్వారా ఏడాదిన్నర పాటు ప్రజల మధ్యనే ఉంటానని, వారి సమస్యలను నేరుగా తెలుసుకుంటానని తెలిపారు. దీనికి ముందుగా ప్రతి వారం ఒక్కో నియోజకవర్గం నాయకులతో సమావేశాలు నిర్వహిస్తామని, వారానికి ఒక నియోజకవర్గాన్ని ఎంపిక చేసి సమీక్ష చేస్తామని జగన్ స్పష్టం చేశారు.
రాబోయే నెలాఖరులో లేదా మార్చి ప్రారంభంలో రాష్ట్ర ప్రభుత్వం మూడో బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉందని పేర్కొన్న జగన్, ఈ ప్రభుత్వానికి ఇంకా మిగిలింది కేవలం రెండు బడ్జెట్లే అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిపాలన తీవ్ర అన్యాయంగా సాగుతోందని ఆరోపించారు. ‘రెడ్‌బుక్ రాజ్యాంగం’ అంటూ ఎక్కడైనా, ఎవరినైనా, ఏమైనా చేయొచ్చన్న ధోరణితో ప్రభుత్వం వ్యవహరిస్తోందని తీవ్ర విమర్శలు చేశారు.
పోలీస్ వ్యవస్థను కూడా దారుణంగా దుర్వినియోగం చేస్తున్నారని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారని జగన్ మండిపడ్డారు. ఇదే కారణంగా ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిందన్నారు. చంద్రబాబు బిర్యానీ పెడతానని నమ్మించి, చివరకు పలావ్ కూడా లేకుండా చేశారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
వైసీపీ ప్రభుత్వ పాలనలో రెండేళ్లు కోవిడ్ వంటి తీవ్ర పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రజలను ఇబ్బంది పెట్టలేదని, ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా ఆపలేదని జగన్ గుర్తు చేశారు. ప్రజలకు చెప్పిన ప్రతి హామీని అమలు చేసి చూపామని, చంద్రబాబు పాలనను మళ్లీ చూసిన తర్వాత ప్రజలకు వాస్తవాలు అర్థమయ్యాయని అన్నారు. అబద్ధాలు, మోసాలు చేయడంలో చంద్రబాబు మాదిరి నాయకుడు లేరని ప్రజలే గుర్తించారని విమర్శించారు.
సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అంటూ చెప్పినవన్నీ మోసాలేనని, వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలలు పూర్తిగా కళ తప్పాయని, విద్యా వ్యవస్థను కూడా నిర్లక్ష్యం చేశారని జగన్ తీవ్రంగా విమర్శించారు.



