యూట్యూబ్ చానళ్ల ముసుగులో మతోన్మాద అరాచకం – జర్నలిజానికి సిగ్గుచేటు

గత కొంతకాలంగా మీడియా ముసుగు వేసుకుని కొందరు మతోన్మాద శక్తులు చేస్తున్న అరాచక చర్యలు రాష్ట్ర ప్రజల్ని తీవ్ర అశాంతికి గురిచేస్తున్నాయి. సమాజంలో మనిషిని మనిషిగా చూడలేని స్థితికి మతోన్మాదం చేరింది. అవకాశం దొరికిన ప్రతిచోట మత విద్వేషాలు రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్న కొన్ని యూట్యూబ్ చానళ్లు ప్రజల మధ్య భయాందోళనలను పెంచుతున్నాయి. ఇలాంటి చానళ్లను నడిపిస్తున్న వారికి జర్నలిజం విలువలు, సామాజిక బాధ్యత, జర్నలిస్ట్‌కి ఉండాల్సిన గౌరవం అన్నీ ఏ మాత్రం పట్టనట్టుగా కనిపిస్తోంది.

మేడారం జాతరలో కోవాబన్ విక్రయానికి వెళ్లిన శేక్షావలి అనే చిరు వ్యాపారిని లక్ష్యంగా చేసుకుని, అతడిని వేధించిన ‘తేజస్విని యూట్యూబ్ ఛానల్’ ప్రతినిధుల వ్యవహారం ఏమాత్రం క్షమించదగినది కాదు. ప్రజల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఒక పేద వ్యాపారిని భయభ్రాంతులకు గురిచేయడానికి కారణం—ఎవరూ ప్రశ్నించరనే అహంకారమేనా? ఇది ఘోరమైన తప్పు. బ్రతుకుదెరువు కోసం వచ్చిన వ్యక్తి పేరు చూసి వివాదం సృష్టించాల్సిన అవసరం ఆ చానల్‌కి ఏముంది? ఆహార నాణ్యతపై సందేహాలుంటే స్థానిక ఫుడ్ ఇన్స్పెక్టర్‌కు ఫిర్యాదు చేయాలనే ఇంగితజ్ఞానం కూడా లేని వారు జర్నలిస్టులని ఎలా చెప్పుకుంటారు? ఇలాంటి దాడులు జరుగుతుంటే చూస్తూ ఊరుకునే మీడియా కూడా బాధ్యత వహించాలి. శేక్షావలి వంటి చిరు వ్యాపారిని టార్గెట్ చేసి మత విద్వేషాలు రెచ్చగొట్టిన ఆ చానల్‌పై పోలీసు అధికారులు కఠిన చర్యలు తీసుకోవాల్సిందే.

ఒక మనిషి కష్టపడి జీవిస్తున్న జీవనోపాధిపై దాడి చేసి, తాను విక్రయిస్తున్న వస్తువుల నాణ్యత పేరిట చిరు వ్యాపారిని దోచుకోవాలని చూడటం జర్నలిజానికి సిగ్గుచేటు. కొందరు లుచ్చా మనస్తత్వం కలవారు జర్నలిజం పేరుతో ఇతర మతాలను దూషిస్తూ దాడులకు పాల్పడటం రాష్ట్ర ప్రజల ఐక్యతను దెబ్బతీయడమే కాకుండా, భారతదేశ లౌకికవాద స్ఫూర్తికే గండిపెడుతోంది. కొన్ని యూట్యూబ్ చానళ్లలో వ్యాఖ్యాతలు, ఇంటర్వ్యూ నిర్వాహకులు జర్నలిజం విలువలను పూర్తిగా పక్కన పెట్టారు. మత సంబంధిత అంశాలపై చర్చలు హద్దులు దాటి అశ్లీల వాదనలుగా మారుతున్నాయి.

ఇంటర్వ్యూ పేరిట కొందరు తమ అడగాల్సిన ప్రశ్నల స్థాయిని దాటిపోయి, తామే మతోన్మాదుల్లా మారి, ఇంటర్వ్యూ ఇస్తున్నవారిపై దూషణలు చేయడం, ఏకవచనంతో వ్యంగ్యంగా మాట్లాడటం, ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకోవడం—ఇదే జర్నలిజం అని చెప్పుకోవడం ప్రజల్ని మూర్ఖులుగా భావించడమే. వ్యూస్ కోసమే పెద్ద జర్నలిస్టుల్లా నటిస్తూ మత విద్వేషాలు రెచ్చగొట్టే ఈ ధోరణి చల్లగా చాపకింద నీరులా కాక, మెల్లగా మండే మంటలా మారుతోంది.

అందుకే ప్రజలు ఇలాంటి యూట్యూబ్ చానళ్ల ప్రసారాలను ఆసక్తిగా చూడటంకన్నా, పూర్తిగా బహిష్కరించడమే మేలైన మార్గం. పవిత్రమైన జర్నలిజంలోకి మతోన్మాదాన్ని చొప్పించి, యూట్యూబ్ వేదికగా మత విద్వేషాలు రెచ్చగొట్టే హక్కు తమకే ఉన్నట్టుగా ప్రవర్తించే వారు జర్నలిస్టులు కాదు—వారు స్పష్టంగా మతోన్మాద అరాచక శక్తులే. ఈ శక్తులను కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. లేనిపక్షంలో దేవుళ్ల పేరుతో జరిగే విద్వేషాలు సమాజాన్ని అగాధంలోకి నెట్టే ప్రమాదం ఉంది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి