ఇటీవల కాలంలో బ్రెయిన్ స్ట్రోక్ యువతను ఎక్కువగా ప్రభావితం చేస్తోంది. మారుతున్న జీవనశైలి, అసమతుల్య ఆహారపు అలవాట్లు, అధిక పని ఒత్తిడి వంటి అంశాలు ఇందుకు ప్రధాన కారణాలుగా వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆశ్చర్యకరంగా, స్ట్రోక్‌కు గురవుతున్నవారిలో సుమారు 25 శాతం మంది యువతే ఉండటం గమనార్హం. కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న అనంతరం ఈ సంఖ్య గణనీయంగా పెరిగిందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా మానసిక ఒత్తిడి పెరగడం దీనికి ప్రధాన కారణమని వారు అభిప్రాయపడుతున్నారు.
ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ గణాంకాల ప్రకారం…
దేశవ్యాప్తంగా ఒక్క సంవత్సరంలోనే 18 లక్షలకుపైగా బ్రెయిన్ స్ట్రోక్ కేసులు నమోదయ్యాయి. గత పదేళ్లతో పోలిస్తే ఈ సంఖ్య దాదాపు రెట్టింపు అయ్యింది. వీరిలో సుమారు 25 శాతం మంది సగటు వయస్సు 35 ఏళ్ల లోపువారే కావడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా తర్వాత యువతలో ఒత్తిడి స్థాయి పెరగడంతో పాటు, పాశ్చాత్య జీవనశైలి, జంక్ ఫుడ్ వినియోగం, శారీరక చురుకుదనం తగ్గడం వంటి అంశాలు స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు, మాదకద్రవ్యాలు మరియు మద్యం వినియోగం పెరగడం కూడా యువతలో స్ట్రోక్ వచ్చే అవకాశాలను అధికం చేస్తున్నట్లు వారు హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతం దేశంలో ప్రతి 400 మందిలో ఒకరు బ్రెయిన్ స్ట్రోక్‌తో బాధపడుతున్నారని అంచనా. అంతేకాదు, ప్రతి నాలుగు నిమిషాలకు ఒకరు స్ట్రోక్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారని వైద్య నిపుణులు వెల్లడించారు.
బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు ఎలా గుర్తించాలి?
స్ట్రోక్ లక్షణాలు వ్యక్తి నుంచి వ్యక్తికి భిన్నంగా ఉండొచ్చు. సాధారణంగా ముఖం లేదా శరీరంలోని ఒక వైపు ఆకస్మికంగా తిమ్మిరి రావడం లేదా బలహీనత ఏర్పడటం, మాట్లాడటంలో లేదా మాటలు అర్థం చేసుకోవడంలో ఇబ్బంది, అకస్మాత్తుగా తీవ్రమైన తలనొప్పి, శరీర నియంత్రణ కోల్పోవడం, తల తిరగడం, ముఖం వాలిపోవడం, చూపు మసకబారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
స్ట్రోక్‌లో “గోల్డెన్ అవర్” అత్యంత కీలకమని వైద్యులు సూచిస్తున్నారు. లక్షణాలు ప్రారంభమైన మొదటి గంటలోపే చికిత్స అందితే ప్రాణాపాయం తగ్గడమే కాకుండా, పూర్తిగా కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు.
బ్రెయిన్ స్ట్రోక్‌కు కారణాలు ఇవే…
మన మెదడు శరీరాన్ని వ్యతిరేక వైపుల నుంచి నియంత్రిస్తుంది. ఎడమ మెదడు కుడి వైపును, కుడి మెదడు ఎడమ వైపును నియంత్రిస్తుంది. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ పెరగడం, ధూమపానం, మద్యపానం, ఊబకాయం, సరైన నిద్ర లేకపోవడం వంటి అంశాలు స్ట్రోక్‌కు ప్రధాన ప్రమాద కారకాలుగా వైద్యులు పేర్కొంటున్నారు. వీటిని నిర్లక్ష్యం చేస్తే స్ట్రోక్ వచ్చే ముప్పు మరింత పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు.
డిశ్చార్జ్ అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా రోగిని ఇంట్లో సరైన విధంగా చూసుకోవడం ఎంతో అవసరం. త్వరగా కోలుకునేందుకు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
మొదటగా, ప్రతి రెండు గంటలకు ఒకసారి శరీర స్థితిని మార్చాలి. ఒకే స్థితిలో ఎక్కువసేపు ఉండటం వల్ల చర్మ సమస్యలు, కండరాల గట్టిపోవడం వంటి ఇబ్బందులు ఏర్పడుతాయి.
రెండవది, “బాల్ పంచింగ్” వ్యాయామం. రోగి చేతిలో ఒక బంతిని ఇచ్చి నిరంతరం నొక్కమని చెప్పాలి. దీని వల్ల చేతి స్నాయువులు చురుకుగా మారి, చేతి పనితనం మెరుగుపడుతుంది.
మూడవది, రోగిని మంచం లేదా కుర్చీపై కూర్చోబెట్టి, ఆపై నిలబడేలా ప్రోత్సహించడం. ప్రతిరోజూ సాధన చేస్తే కాళ్ల బలం పెరిగి, క్రమంగా నడవగలిగే స్థాయికి చేరుకుంటారు.
అదనంగా, రోజుకు కనీసం రెండుసార్లు చేతులు, కాళ్లకు సున్నితమైన వ్యాయామాలు చేయాలి. కాలి వేళ్లను పైకి–క్రిందికి కదిలించే వ్యాయామం కూడా ఎంతో ఉపయోగకరమని నిపుణులు చెబుతున్నారు.
ఈ సమయంలో రోగి ఎటువంటి మానసిక ఒత్తిడికి గురికాకుండా చూసుకోవడం అత్యంత ముఖ్యం. తగినంత నిద్ర, పోషకాహారం, సానుకూల ఆలోచనలు రోగి త్వరగా కోలుకునేందుకు సహాయపడతాయని వైద్యులు సూచిస్తున్నారు. బలమైన సంకల్పశక్తితో పాటు కుటుంబ సభ్యుల సహకారం ఉంటే, బ్రెయిన్ స్ట్రోక్ బారి నుంచి బయటపడడం సాధ్యమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.



