అమెరికాలో ఉన్నత చదువులు చేపట్టిన తెలుగు యువతి అనారోగ్యంతో మృతి చెందింది. ఈ విషాద ఘటన బాపట్ల జిల్లా కారంచేడు గ్రామంలో తీవ్ర శోకాన్ని రేకెత్తించింది. గ్రామానికి చెందిన యార్లగడ్డ రాజ్యలక్ష్మి (23) అమెరికాలో కన్నుమూశారు.
వివరాల ప్రకారం, రాజ్యలక్ష్మి అమెరికాలోని ప్రఖ్యాత టెక్సాస్ ఏ అండ్ ఎమ్ యూనివర్సిటీలో ఇటీవల తన ఎంఎస్ డిగ్రీని పూర్తి చేశారు. ఉన్నత భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో ఉన్న ఆమె అనారోగ్యంతో చికిత్స పొందుతూ మరణించినట్లు సమాచారం. ఈ వార్త తెలిసిన వెంటనే కారంచేడు గ్రామంలో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు పెట్టుకున్నారు. ఉన్నత విద్యను పూర్తి చేసి ఉజ్వల భవిష్యత్తుతో తిరిగి రావాలనుకున్న యువతీ అకాల మరణం తల్లిదండ్రులను తీవ్ర దుఃఖంలో మునిగిపెట్టింది.
ఈ విషాదంపై పర్చూరు శాసనసభ్యుడు ఏలూరి సాంబశివరావు రాజ్యలక్ష్మి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపం తెలిపారు. కారంచేడు గ్రామంలో ఈ ఘటనతో విషాద భరిత వాతావరణం నెలకొంది.



