ప్రపంచంలో అత్యంత చిన్న దేశం ఏమిటి అని చాలా మందిని అడిగితే వారు వెంటనే వాటికన్ సిటీ అనే సమాధానం చెబుతారు. కానీ, వాస్తవానికి దానికంటే కూడా చిన్న దేశం ఒకటి ఉంది అని మీకు తెలుసా? ఆ దేశంలో కేవలం ముగ్గురు మాత్రమే నివసిస్తున్నారు.
ఇంతకీ ఏంటా దేశం? ఎక్కడ ఉంది? ఇప్పుడే తెలుసుకుందాం.
ప్రపంచంలో సుమారు 225 దేశాలు ఉన్నప్పటికీ, కొన్ని దేశాలు అత్యంత చిన్నవిగా, విభిన్నంగా ఉంటాయి. అలాంటి వాటిలోనే ఒకటి మోలోసియా (Molossia). ఇది అమెరికా దేశంలోని నెవాడా రాష్ట్రంలో ఉంది. దీన్ని “రిపబ్లిక్ ఆఫ్ మోలోసియా”గా (Republic of Molossia) పిలుస్తారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, ఇక్కడ జనాభా కేవలం ముగ్గురే. వీరితో పాటు మూడు కుక్కలు కూడా నివసిస్తున్నాయి.
ప్రారంభంలో ఈ చిన్న దేశంలో సుమారు 38 మంది జీవించేవారు. కాలక్రమంలో ఆ సంఖ్య తగ్గి, ఇప్పుడు కేవలం ముగ్గురికి పరిమితమైంది.

మోలోసియా, నెవాడా రాష్ట్రంలోని డేటన్ అనే పట్టణంలో ఉంది. కార్సన్ సిటీకి 30 నిమిషాల డ్రైవ్ దూరం మాత్రమే. మొత్తం భూమి విస్తీర్ణం కేవలం 11.3 ఎకరాలు. ఈ దేశాన్ని 1977లో స్థాపించారు. ఆరంభంలో దీన్ని “గ్రాండ్ రిపబ్లిక్ ఆఫ్ వాల్డ్స్టీన్” అని పిలిచేవారు. 1998లో పేరును మార్చి “కింగ్డమ్ ఆఫ్ మోలోసియా”గా ఉంచారు. ప్రస్తుతం దేశాధ్యక్షుడిగా కెవిన్ బా వ్యవహరిస్తున్నారు.
మోలోసియాకు కూడా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. సొంత నౌకాదళం, డాక్స్ సర్వీస్, చిన్న అంతరిక్ష కార్యక్రమం, రేడియో స్టేషన్, సొంత బ్యాంకు, ఒక చిన్న రైలు మార్గం ఇలా ఎన్నో వసతులు అందుబాటులో ఉన్నాయి. అయితే, ఈ దేశాన్ని యునైటెడ్ నేషన్స్ లేదా ఏ ఇతర అంతర్జాతీయ సంస్థలు అధికారికంగా గుర్తించలేదు. అయినా కూడా మోలోసియా తమను స్వతంత్ర దేశంగా ప్రకటించుకుని కొనసాగుతోంది.
ఇక్కడ కొన్ని ఆసక్తికరమైన నిబంధనలు ఉన్నాయి. ఉదాహరణకు, ఈ దేశంలో క్యాట్ ఫిష్ మరియు ఉల్లిపాయలను తీసుకురావడం కఠినంగా నిషేధించబడింది. ఎవరైనా ఇలా చేస్తే, వారికి జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంటుంది.

మోలోసియాలో అధికార భాష ఇంగ్లిష్ అయినా, ఎస్పెరాంటో, స్పానిష్ కూడా మాట్లాడతారు. ఇక్కడ వినియోగించే కరెన్సీ పేరు వెలోరా (Valora).
పర్యాటకులకోసం మోలోసియా ప్రత్యేక అనుభూతిని అందిస్తుంది. ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య ఎక్కువ పర్యాటకులు ఇక్కడికి వస్తారు. వారు ముందుగా బుక్ చేసుకుని, ఈ చిన్న దేశాన్ని సందర్శించవచ్చు. దేశం అంతటా నడిచి చుట్టేయవచ్చు. ఇక్కడ స్వయంగా తయారు చేసిన నీరు “Molossian Water” అనే బ్రాండ్ పేరుతో లభిస్తుంది.
ఇప్పటివరకు మోలోసియాను కేవలం సుమారు 200 మైక్రో నేషన్స్‌లో ఒకటిగా మాత్రమే గుర్తించారు. అయినా దీని విభిన్న సంస్కృతి, చరిత్ర, వినూత్న నియమాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. కేవలం ముగ్గురు మాత్రమే నివసించే ఈ దేశం పర్యాటకుల రాకతో ఎప్పుడూ చురుగ్గా కనిపిస్తుంది.



