ప్రపంచకప్ సెమీఫైనల్లో భాగంగా ముంబై వేదికగా గురువారం జరిగిన ఉత్కంఠభరిత పోరులో టీమిండియా మహిళల జట్టు అద్భుత విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచే ఈ మ్యాచ్‌లో బలమైన ఆస్ట్రేలియాపై భారత్ 339 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి సంచలనాన్ని సృష్టించింది. ఈ విజయంతో మహిళల వన్డే క్రికెట్లో అత్యధిక ఛేదన రికార్డు భారత్ పేరిట నమోదైంది.
ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేసి 49.5 ఓవర్లలో 338 పరుగులకు ఆలౌట్ అయింది. లీచ్‌ఫీల్డ్ (119), ఎలిస్ పెర్రీ (77), అష్లీ గార్డ్నర్ (63) కీలక ఇన్నింగ్స్ ఆడారు. భారత బౌలర్లలో శ్రీచరణి, దీప్తి శర్మ చెరో రెండు వికెట్లు పడగొట్టగా, అమన్జ్యోతి, రాధ చెరో వికెట్ తీశారు.
భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ షెఫాలీ (10) త్వరగానే వెనుదిరగగా, స్మృతీ మందాన (24) కూడా పెద్దగా రాణించలేకపోయింది. అయితే ఆ తర్వాత జెమీమా రోడ్రిగ్స్ (127), హర్మన్‌ప్రీత్ కౌర్ (89) అద్భుత భాగస్వామ్యాన్ని నిర్మించారు. ఇద్దరూ జట్టు ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టి 167 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
హర్మన్ ఔటైన తర్వాత కూడా జెమీమా తన ధైర్యసాహసాలతో జట్టును విజయతీరాలకు చేర్చింది. ఆమెతో పాటు దీప్తి శర్మ (24), రీచా ఘోష్ (26), అమన్ జ్యోత్ (15)లు కీలక మద్దతు అందించారు. ఫలితంగా భారత్ 48.3 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసి గెలుపు సాధించింది. ఈ విజయంతో భారత్ మూడోసారి ప్రపంచకప్ ఫైనల్లో అడుగుపెట్టింది.
ఏడుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియాపై ఇంత పెద్ద లక్ష్యాన్ని ఛేదించడం భారత మహిళలకే సాధ్యమైందని క్రీడా నిపుణులు ప్రశంసిస్తున్నారు. ఈ విజయంతో భారత క్రీడాభిమానులు, జట్టు సభ్యులు ఆనందభాష్పాలు పెట్టారు. ముఖ్యంగా జెమీమా తన కుటుంబ సభ్యులతో కలసి కన్నీరు పెట్టుకోవడం హృదయాన్ని తాకింది.
విజయం పట్ల సామాన్యుల నుండి ప్రముఖుల వరకు సోషల్ మీడియాలో అభినందనల వర్షం కురుస్తోంది. టాలీవుడ్ అగ్ర కథానాయకుడు విక్టరీ వెంకటేష్ ట్వీట్ చేస్తూ, “టీమిండియా అద్భుతమైన ప్రదర్శన చేసింది. భారీ టార్గెట్ ఛేదించడం చిన్న విషయం కాదు. జెమీమా, హర్మన్‌ప్రీత్, రీచా, దీప్తి — మీరు నిజంగా దేశ గర్వం. ఇదే స్పూర్తితో ఫైనల్లో కూడా ట్రోఫీని సాధించండి” అని పేర్కొన్నారు.
ఈ విజయం భారత మహిళా క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని రాసిందని క్రీడాభిమానులు చెబుతున్నారు.



