భారతదేశంలో చలికాలం అనగానే చాలామందికి ఆహ్లాదకరమైన వాతావరణమే గుర్తుకు వస్తుంది. ఉదయపు ముసురు, చల్లటి గాలి, వేడి వేడి కాఫీలు… ఇవన్నీ మజానే. కానీ నిజంగా చలిదేశాల్లో నివసించేవారికే తెలుస్తుంది – ఆ వాతావరణంలో జీవించడం ఎంత కష్టమో!
అయితే, వింటర్ స్ట్రోక్స్ అనేవి కేవలం చలిదేశాలకే పరిమితం కావని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. శీతాకాలంలో ప్రపంచవ్యాప్తంగా స్ట్రోక్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని అనేక అధ్యయనాలు వెల్లడించాయి. ఇవి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపడమే కాకుండా, కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకంగా కూడా మారుతున్నాయి.
అసలు ‘వింటర్ స్ట్రోక్’ అంటే ఏమిటి?
స్ట్రోక్ అనేది మెదడుకు రక్త సరఫరా అకస్మాత్తుగా ఆగిపోవడం లేదా మెదడులో రక్తస్రావం జరగడం వల్ల ఏర్పడే అత్యవసర ఆరోగ్య పరిస్థితి. శీతాకాలంలో శరీరంలో జరిగే కొన్ని మార్పుల కారణంగా ఈ స్ట్రోక్స్ ప్రమాదం మరింత పెరుగుతుంది.
వింటర్‌లో చాలామంది ఫుడ్, స్కిన్‌కేర్‌పై శ్రద్ధ పెడతారు. కానీ గుండె, మెదడు ఆరోగ్యంపై చూపాల్సిన జాగ్రత్తలను నిర్లక్ష్యం చేస్తారని డాక్టర్లు చెబుతున్నారు. ముఖ్యంగా హార్ట్, బ్రెయిన్ వంటి కీలక అవయవాలు ఈ కాలంలో ఎక్కువ రిస్క్‌లో ఉంటాయి.
చలికాలంలో పెరుగుతున్న ప్రధాన ప్రమాదాలు
● డీప్ వీనస్ థ్రోంబోసిస్ (DVT)
కాళ్లలోని లోతైన సిరల్లో రక్తం గడ్డకట్టే పరిస్థితినే డీప్ వీనస్ థ్రోంబోసిస్ అంటారు. శీతాకాలంలో శారీరక చురుకుదనం తగ్గడం వల్ల రక్త ప్రసరణ మందగిస్తుంది. దీంతో రక్తం గడ్డకట్టే అవకాశాలు ఎక్కువవుతాయి.
ఒక అధ్యయనం ప్రకారం, వింటర్‌లో వీనస్ థ్రోంబోఎంబోలిజం ప్రమాదం సుమారు 14 శాతం వరకు పెరుగుతుంది.
● హార్ట్ స్ట్రోక్ (హృదయ ఘాతం)
ప్రపంచవ్యాప్తంగా జరిగిన అధ్యయనాల ప్రకారం, హార్ట్ స్ట్రోక్స్ శీతాకాలంలో ఎక్కువగా నమోదవుతున్నాయి.
చలిలో రక్తనాళాలు సంకోచించి బిగుతుగా మారడం వల్ల గుండెపై అదనపు ఒత్తిడి పడుతుంది. అలాగే ఈ కాలంలో ఫిజికల్ యాక్టివిటీ తగ్గడం, విటమిన్ D లోపం, స్ట్రెస్ హార్మోన్ల పెరుగుదల వల్ల బ్లడ్ ప్రెజర్ కూడా పెరుగుతుంది.
● నాన్-ట్రామాటిక్ ఇంట్రా సెరెబ్రల్ హీమరేజ్
ఎటువంటి గాయం లేకుండా మెదడులో రక్తస్రావం జరగడాన్ని ఈ కండిషన్ అంటారు. శీతాకాలంలో బ్లడ్ ప్రెజర్ నియంత్రణలో లేకపోవడం వల్ల ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.
బంగ్లాదేశ్, జపాన్, బ్రిటన్, పోర్చుగల్ వంటి దేశాల్లో వింటర్‌లో ఈ కేసులు అధికంగా నమోదవుతున్నాయి.
● ఏట్రియల్ ఫైబ్రిలేషన్
హృదయ స్పందన అస్థిరంగా మారే ఈ పరిస్థితి స్ట్రోక్‌కు దారితీయవచ్చు. తక్కువ ఉష్ణోగ్రతలు, అధిక తేమ, బలమైన గాలులు ఉన్నప్పుడు ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
వృద్ధులు, హైబీపీ, గుండె జబ్బులు ఉన్నవారిలో ప్రమాదం ఎక్కువ.
● ఇస్కెమిక్ స్ట్రోక్
ఉష్ణోగ్రతలు పడిపోతే శరీరంలో రక్త ప్రసరణపై తీవ్ర ప్రభావం పడుతుంది. మెదడులోని ఒక భాగానికి రక్త సరఫరా నిలిచిపోతే ఇస్కెమిక్ స్ట్రోక్ వస్తుంది. కొన్ని నిమిషాల్లోనే మెదడు కణాలు దెబ్బతినడం ప్రారంభమవుతుంది.
● వింటర్ డీహైడ్రేషన్
చలికాలంలో దాహం తక్కువగా అనిపించడంతో చాలామంది నీరు తక్కువగా తాగుతారు. కానీ ఇది అత్యంత ప్రమాదకరం. డీహైడ్రేషన్ వల్ల రక్తం గాఢంగా మారి, గడ్డకట్టే ప్రమాదం పెరుగుతుంది.
● వెంట్రిక్యులర్ అర్రిథ్మియాస్ & యాంజినా పెక్టోరిస్
అసాధారణ హార్ట్ రిథమ్స్ వల్ల వచ్చే ఈ సమస్యలు చలికాలంలో ఎక్కువగా కనిపిస్తాయి. గుండెకు రక్త సరఫరా తగ్గినప్పుడు వచ్చే ఛాతీ నొప్పిని యాంజినా అంటారు. ఇటలీ, రష్యా వంటి దేశాల్లో వింటర్‌లో ఇవి అధికంగా నమోదవుతున్నాయి.
ఎవరికీ ప్రమాదం ఎక్కువ?
- గుండె జబ్బులు, డయాబెటిస్, హై కొలెస్ట్రాల్ ఉన్నవారు
- హైబీపీ బాధితులు
- వృద్ధులు
- వ్యాయామం చేయని వారు
- నీరు తక్కువగా తాగేవారు
- పొగతాగడం, మద్యపానం అలవాట్లు ఉన్నవారు
లక్షణాలు గుర్తిస్తే… ‘గోల్డెన్ అవర్’లో ప్రాణాలు కాపాడొచ్చు!
స్ట్రోక్ లక్షణాలు కనిపించిన వెంటనే ఒక గంటలోపు చికిత్స (Golden Hour) అందితే మెదడును కాపాడుకోవచ్చు. దీర్ఘకాలిక వైకల్యాన్ని నివారించవచ్చు.
BE FAST లక్షణాలు:
- B – బ్యాలెన్స్ కోల్పోవడం
- E – చూపులో మార్పులు
- F – ముఖం వంకరపోవడం
- A – చేతులు బలహీనపడటం
- S – మాట తడబాటు
- T – వెంటనే చికిత్స తీసుకోవాలి
స్ట్రోక్ స్పెషలిస్ట్, న్యూరాలజిస్ట్ డాక్టర్ అరవింద్ శర్మ మాట్లాడుతూ –
“సమయానికి అవేర్‌నెస్, ట్రీట్మెంట్ ఉంటే 80 శాతం స్ట్రోక్స్‌ను నివారించవచ్చు” అని తెలిపారు.
ఆధునిక వైద్యం – ఆశాజనక ఫలితాలు
న్యూరో ఇమేజింగ్‌లో CT, MRI వంటి ఆధునిక స్కాన్లు అందుబాటులోకి రావడంతో స్ట్రోక్ ఎక్కడ, ఏ రకంగా వచ్చిందో వెంటనే గుర్తిస్తున్నారు.
ఇస్కెమిక్ స్ట్రోక్‌లో గడ్డకట్టిన రక్తాన్ని కరిగించే చికిత్స, అవసరమైతే ఎండోవాస్క్యులర్ థెరపీ ద్వారా క్లాట్‌ను తొలగించే అవకాశం ఉంది.
నాలుగున్నర గంటల్లో చికిత్స అందితే పూర్తిగా కోలుకునే అవకాశాలు చాలా ఎక్కువ.
జాగ్రత్తే రక్ష
ఈ వింటర్‌లో 30 నుంచి 65 ఏళ్ల మధ్య వయసువారిలో స్ట్రోక్ కేసులు సుమారు 10 శాతం పెరిగినట్టు నిపుణులు చెబుతున్నారు.
బలహీనత, మాట తడబాటు, చూపు మార్పులు కనిపిస్తే వెంటనే ఆస్పత్రికి వెళ్లాలి.



