తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పెరుగుతున్న చలి తీవ్రత – సంక్రాంతికి గరిష్ఠ స్థాయి

తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా కొంత మేర తగ్గిన చలి తీవ్రత మళ్లీ పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. రాబోయే వారం రోజుల పాటు (జనవరి 5 నుంచి 12 వరకు) ఉత్తర, ఈశాన్య దిశల నుంచి వీచే చలిగాలుల ప్రభావంతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. డిసెంబరు తొలి వారంలో అనుభవించిన చలిగాలుల తీవ్రతే మళ్లీ పునరావృతం అయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం ఈశాన్య, తూర్పు దిశల నుంచి గాలులు వీస్తుండటంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలవ్యాప్తంగా చలి వాతావరణం కొనసాగుతోంది. రాబోయే ఐదు రోజుల పాటు ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పులు ఉండబోవని, ప్రస్తుతం ఉన్న చలివాతావరణమే కొనసాగుతుందని అమరావతి వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో పొడి వాతావరణం నెలకొనగా, కొన్ని జిల్లాల్లో ఉదయం వేళల్లో పొగమంచు ఏర్పడే అవకాశముందని పేర్కొంది.

చలి గరిష్ఠ స్థాయికి చేరే అవకాశం

సంక్రాంతి పండుగ సమయానికి చలి తీవ్రత గరిష్ఠ స్థాయికి చేరుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. జనవరి చివరి వారంనుంచి క్రమంగా ఎండ తీవ్రత పెరిగి శీతాకాలం తగ్గుముఖం పడుతుందని అధికారులు తెలిపారు. పలు జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు చేరే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇప్పటికే సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 11.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు వెల్లడించారు.

పగటి వేళల్లోనూ చలి ప్రభావం స్పష్టంగా కనిపించనుంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 25 నుంచి 26 డిగ్రీల సెల్సియస్ మధ్యనే నమోదయ్యే అవకాశం ఉందని అంచనా. రాబోయే రెండు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా దట్టమైన పొగమంచు కమ్ముకునే సూచనలు ఉన్నందున ఉదయం వేళల్లో ప్రయాణించే వాహనదారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వృద్ధులు, చిన్నపిల్లలు, శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణాలు చేసే వారు పొగమంచు ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికతో ప్రయాణాలు చేయాలని వాతావరణ శాఖ సూచించింది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి