గ్రామాలపై ఆకలి దాడులు చేస్తున్న కోతుల గుంపులు ఇప్పుడు మనుషుల ప్రాణాలకే ముప్పుగా మారుతున్నాయి. వరంగల్ జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన స్థానికులను భయాందోళనకు గురిచేసింది. కోతుల దాడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఓ యువకుడు వ్యవసాయ బావిలో పడిపోయి రెండు గంటలకు పైగా మృత్యువుతో పోరాడాడు.
ఈ ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలో చోటుచేసుకుంది. డీసీ తండాకు చెందిన విక్రమ్ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి వర్ధన్నపేట శివారులోని ధాన్యం విక్రయ కేంద్రం సమీపంలో వెళ్తుండగా అకస్మాత్తుగా కోతుల గుంపు అతనిపై మూకుమ్మడిగా దాడి చేసింది. కోతుల నుంచి తప్పించుకునే క్రమంలో విక్రమ్ భయంతో పరుగెత్తగా, పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో పడిపోయాడు.
విక్రమ్ బావిలో పడిన విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించారు. కోతులను కర్రలతో తరిమివేసి, బావిలో పడిన యువకుడిని కాపాడేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే తీవ్రంగా గాయపడిన విక్రమ్ దాదాపు రెండు గంటలకు పైగా బావిలోనే చిక్కుకుని మృత్యువుతో పోరాడాడు.
స్థానికులు, స్నేహితులు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది బావిలోకి దిగి విక్రమ్‌ను సురక్షితంగా బయటకు తీశారు. ఈ ప్రమాదంలో విక్రమ్‌కు రెండు చేతులు విరిగినట్లు తెలుస్తోంది. తీవ్ర గాయాలతో ఉన్న అతన్ని మెరుగైన చికిత్స కోసం వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటన నేపథ్యంలో గ్రామాల్లో కోతుల బెడదపై ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అనేక గ్రామాల్లో కోతుల దాడులతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, చిన్నపిల్లలు, వృద్ధులు అన్న తేడా లేకుండా కోతులు దాడి చేస్తున్నాయని వాపోతున్నారు. కోతుల బెడద నుంచి తమ ప్రాణాలను కాపాడాలని స్థానికులు అధికారులను వేడుకుంటున్నారు.



