డబ్బులు డ్రా చేసినా నగదు బయటకు రాకపోవడంతో ‘ఏటీఎం పనిచేయడం లేదేమో’ అనుకుని వెళ్లిపోతున్నారా? అయితే అది మీకు పెద్ద నష్టంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే, ఏటీఎంలను టార్గెట్‌గా చేసుకుని కేటుగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. దేశవ్యాప్తంగా రోజుకో కొత్త పద్ధతిలో చోరీలకు తెరలేపుతున్న ఈ ముఠాలపై తాజాగా వరంగల్ కమిషనరేట్ పోలీసులు ప్రజలను అలర్ట్ చేశారు.
ఇనుప ప్లేట్లు అమర్చి ఏటీఎంలలో నగదు చోరీ
వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఇటీవల బయటపడిన ఈ కేసు వివరాలు సంచలనంగా మారాయి. ఏటీఎం మిషన్లలో డబ్బులు బయటకు రాకుండా ఇనుప ప్లేట్లు అమర్చి నగదును చోరీ చేస్తున్న రాజస్థాన్‌కు చెందిన అంతర్‌రాష్ట్ర ముఠాను వరంగల్ సీసీఎస్, కాజీపేట పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. ఈ ముఠాకు చెందిన ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.5,10,000 నగదు, రెండు కార్లు, ఏడు సెల్‌ఫోన్లు, ఇనుప ప్లేట్లు, నకిలీ తాళంచెవులను స్వాధీనం చేసుకున్నారు.
సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఏటీఎం చోరీలు
అరెస్టైన నిందితులు రాజస్థాన్ రాష్ట్రం అల్వార్ జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఒకే ప్రాంతానికి చెందిన వీరంతా పరస్పర పరిచయంతో కలిసి మద్యం సేవిస్తూ జల్సాలకు అలవాటు పడ్డారని విచారణలో వెల్లడైంది. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతోనే ఏటీఎంలను లక్ష్యంగా చేసుకుని ఈ చోరీలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
పాత ఏటీఎం మిషన్ల లోపాలను ఆసరాగా చేసుకుని మోసం
పెర్టో కంపెనీకి చెందిన పాత ఎస్‌బీఐ ఏటీఎం మిషన్లలో ఉన్న సాంకేతిక లోపాలను ఈ ముఠా లోతుగా అధ్యయనం చేసింది. నకిలీ తాళంచెవులతో ఏటీఎం తెరిచి, నగదు బయటకు వచ్చే మార్గంలో ఇనుప ప్లేట్‌ను గమ్‌తో అమర్చేవారు. దీంతో ఖాతాదారుడు డబ్బులు డ్రా చేసినా నగదు బయటకు రాకుండా మిషన్‌లోనే ఆగిపోయేది. ఏటీఎం సరిగా పనిచేయడం లేదనుకుని ఖాతాదారుడు వెళ్లిపోయిన తర్వాత, మళ్లీ వచ్చి ఏటీఎం తెరిచి లోపల నిలిచిపోయిన నగదును చోరీ చేసేవారు.
దేశవ్యాప్తంగా 40కి పైగా చోరీలు – వరంగల్‌లో భారీ నష్టం
ఈ ముఠా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఇలాంటి చోరీలు 40కి పైగా చేసినట్లు విచారణలో తేలింది. వరంగల్ ట్రైసిటీ పరిధిలోనే 7 ఏటీఎం కేంద్రాల్లో సుమారు రూ.12.10 లక్షల మేర చోరీ జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. తాజాగా కాజీపేటలో మరో చోరీకి యత్నిస్తుండగా, ముందస్తు నిఘాతో పోలీసులు నిందితులను పట్టుకున్నారు.
ఈ కేసును సమర్థంగా ఛేదించిన పోలీస్ అధికారులను వరంగల్ పోలీస్ కమిషనర్ అభినందిస్తూ రివార్డులు అందజేశారు. ఏటీఎంలలో నగదు డ్రా చేసుకునే సమయంలో ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే బ్యాంక్ అధికారులకు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని, నిర్లక్ష్యం చేయవద్దని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు.



