విస్సన్నపేట జూనియర్ కాలేజీలో దారుణం: వాష్‌రూమ్‌కు వెళ్లారనే కారణంతో విద్యార్థినులపై వైస్ ప్రిన్సిపల్ దాడి

ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలోని వికాస్ జూనియర్ కాలేజీలో ఘోర సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇంటర్ ఫస్ట్‌ ఇయర్‌లో చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు వాష్‌రూమ్ అవసరానికి వెళ్లారనే చిన్న కారణంతోనే, కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ గువ్వల శ్రీనివాస్ రెడ్డి వారిపై అమానుషంగా దాడి చేసిన విషయం ఆలస్యంగా బయటపడింది. మానవత్వాన్ని మరిచిపోయిన ఈ దురాగతం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది.

వాష్‌రూమ్‌కి వెళ్లారని కరెంట్‌ వైర్‌తో దారుణ దాడి

విద్యార్థినుల కథనం ప్రకారం—తాము పర్మిషన్ అడిగినప్పటికీ, వైస్ ప్రిన్సిపల్ అనుమతి ఇవ్వక‌పోవడంతో కొంతసేపు కట్టుదిట్టంగా ఓపిక పట్టామని చెబుతున్నారు. అయితే పరిస్థితి అదుపులో లేక, తప్పనిసరిగా వాష్‌రూమ్‌కు వెళ్లాల్సి వచ్చిందని కన్నీటి పర్యంతం అవుతున్నారు. తిరిగి తరగతి గదికి వస్తుండగా, క్లాస్‌కు లేట్ అయినట్టు భావించిన వైస్ ప్రిన్సిపల్ ఆగ్రహంతో కరెంట్ వైర్‌ తీసుకుని వారిని విచక్షణ లేకుండా వరుసగా కొట్టినట్లు స్టాఫ్ సభ్యులు చెబుతున్నారు. దాడి తీవ్రతకు విద్యార్థినులు అక్కడికక్కడే స్పృహ కోల్పోయి నేలకూలినట్లు సమాచారం.

సత్యం బయటపడకుండానే కప్పిపుచ్చే యత్నం

ఈ ఘటన బయటకు రాకుండా చేయాలని ప్రయత్నించిన కాలేజీ యాజమాన్యం, తీవ్ర గాయాలతో ఉన్న విద్యార్థినులను వెంటనే ఓ ఆటోలో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి గుట్టుగా చికిత్స చేయించినట్టు తెలిసింది. ఆసుపత్రి సిబ్బంది కూడా ఘటన నమోదు కాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం అనుమానాలను మరింత పెంచుతోంది.

చికిత్స అనంతరం ఇంటికి చేరుకున్న విద్యార్థినులు జరిగిన అన్యాయాన్ని తల్లిదండ్రులకు వెల్లడించడంతో విషయం పెద్ద ఎత్తున బయటపడింది. మానసికంగా మురిగిపోయిన తల్లిదండ్రులు కాలేజీ యాజమాన్యాన్ని నిలదీస్తూ, “వాష్‌రూమ్‌కు వెళ్లినందుకు ఇలా అమానుషంగా కొడతారా?” అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికులు కూడా విద్యార్థినుల కుటుంబాలకి అండగా నిలబడి కాలేజీ చర్యలను ఖండించారు.

యాజమాన్యంపై ఒత్తిడి పెరగడంతో, దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వైస్ ప్రిన్సిపల్ గువ్వల శ్రీనివాస్ రెడ్డి పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. బాధ్యులపై వెంటనే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి