భారత్ – న్యూజిలాండ్ మధ్య జరగనున్న కీలకమైన మూడో వన్డే మ్యాచ్‌కు ముందే టీమిండియా ఇండోర్ చేరుకుంది. సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా ఉండటంతో, నిర్ణయాత్మక మ్యాచ్‌లో విజయం సాధించాలనే లక్ష్యంతో భారత ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు. అయితే మైదానంలో పోరాటంతో పాటు దైవబలాన్ని కూడా కోరుకుంటూ టీమిండియా స్టార్‌లు ఆధ్యాత్మిక బాట పట్టారు.
ఇండోర్‌కు సమీపంలోని ఉజ్జయినిలో ఉన్న మహాకాళేశ్వర జ్యోతిర్లింగాన్ని విరాట్ కోహ్లీ, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ శనివారం తెల్లవారుజామున దర్శించుకున్నారు. కీలక మ్యాచ్ ముందు మహాకాళుడి ఆశీస్సులు తీసుకోవడం ఇప్పుడు భారత క్రికెట్ జట్టులో ఒక ఆనవాయితీగా మారుతోంది.
భస్మ హారతిలో పాల్గొన్న కోహ్లీ, కుల్దీప్
ఉదయం 4 గంటలకు జరిగే అత్యంత పవిత్రమైన భస్మ హారతిలో విరాట్ కోహ్లీ, కుల్దీప్ యాదవ్ పాల్గొన్నారు. సుమారు రెండు గంటల పాటు ఆలయ ప్రాంగణంలో గడిపిన వీరు, నంది మండపంలో కూర్చుని శివనామస్మరణలో లీనమయ్యారు. గర్భాలయ చౌకట్ నుంచి మహాకాళుడిని దర్శించుకుని జలాభిషేకం చేశారు. అనంతరం ఆలయ కమిటీ స్వామివారి ప్రసాదంతో పాటు మహాకాళేశ్వరుడి చిత్రపటాన్ని వారికి బహుకరించింది.
మహాకాళేశ్వర ఆలయ ప్రత్యేకత ఇదే
ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది దక్షిణాభిముఖ జ్యోతిర్లింగం కావడం దీని విశిష్టత. ఇక్కడ జరిగే భస్మ హారతి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. మహాకాళుడిని భక్తితో పూజిస్తే అకాల మృత్యు భయం తొలగిపోతుందని, చేపట్టిన కార్యాల్లో విజయం లభిస్తుందని భక్తుల నమ్మకం.
అందుకే క్రికెటర్లే కాదు, బాలీవుడ్ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు కూడా కీలక సందర్భాల్లో లేదా కెరీర్‌లో కష్టకాలం ఎదురైనప్పుడు ఈ ఆలయాన్ని దర్శించుకుంటుంటారు. ఇటీవలే కెఎల్ రాహుల్, గౌతమ్ గంభీర్ కూడా మహాకాళేశ్వరుడిని దర్శించుకోవడం గమనార్హం.
ఇండోర్‌లో కోహ్లీ బ్యాడ్ రికార్డు చెరిపేస్తాడా?
విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా అనేక మైదానాల్లో అద్భుతమైన రికార్డులున్నాయి. అయితే ఇండోర్ హోల్కర్ స్టేడియం మాత్రం కోహ్లీకి అంతగా కలిసి రాలేదు. ఇక్కడ ఆడిన 4 వన్డే మ్యాచ్‌ల్లో కోహ్లీ కేవలం 99 పరుగులు మాత్రమే చేశాడు. ఇప్పటివరకు ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదు కాలేదు.
ప్రపంచకప్ ముందు ఫామ్‌ను కొనసాగించాలన్నా, ఇండోర్‌లో ఉన్న ఈ బ్యాడ్ రికార్డును చెరిపేయాలన్నా ఈ మ్యాచ్ కోహ్లీకి చాలా కీలకం. అందుకే మహాకాళుడి ఆశీస్సులతో ఈసారి ఇండోర్ గడ్డపై కోహ్లీ సెంచరీ సాధిస్తాడని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.



