విజయవాడలో న్యూ ఇయర్ సంబరాలకు సిద్ధమవుతున్న ప్రజలకు పోలీసులు కఠిన హెచ్చరిక జారీ చేశారు. కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా నగరంలో శాంతిభద్రతలకు భంగం కలగకుండా పలు కీలక ఆంక్షలను అమలు చేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ప్రకటించారు. రోడ్లపై జనసంచారం, వాహనాల రాకపోకలు, వేడుకల నిర్వహణపై నియంత్రణలు విధిస్తున్నట్లు తెలిపారు.
కొత్త ఏడాది వేడుకల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని సీపీ స్పష్టం చేశారు. ఈ నెల 31వ తేదీ రాత్రి నుంచి నగరంలోని బెంజ్ సర్కిల్, కనకదుర్గ ఫ్లైఓవర్‌తో పాటు అన్ని ఫ్లైఓవర్లను మూసివేయనున్నట్లు వెల్లడించారు. ఈ ఆంక్షలను జనవరి 13వ తేదీ వరకు రాత్రి వేళల్లో అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు.
అదే విధంగా న్యూ ఇయర్ వేడుకల పేరుతో రోడ్లపైకి వచ్చి కేక్‌లు కట్ చేయడం, బాణసంచా కాల్చడం, గుంపులుగా చేరి హంగామా చేయడం పూర్తిగా నిషేధమని సీపీ స్పష్టం చేశారు. యువత వేగంగా వాహనాలు నడపడం, బైక్‌లపై ప్రమాదకర విన్యాసాలు చేయడం, సైలెన్సర్లు తొలగించి శబ్ద కాలుష్యం సృష్టించడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని అరికట్టేందుకు ప్రత్యేక డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే ట్రిపుల్ రైడింగ్, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన వంటి అంశాల్లోనూ రాజీ లేకుండా కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.
కొత్త సంవత్సరం వేడుకలను ప్రశాంతంగా, భద్రంగా జరుపుకోవాలంటే ప్రజలంతా పోలీసులకు సహకరించాలని సీపీ రాజశేఖర్ బాబు కోరారు. రోడ్లపై కాకుండా తమ ఇళ్ల వద్దే సంబరాలు చేసుకుని, శాంతియుతంగా నూతన సంవత్సరాన్ని స్వాగతించాలని ఆయన సూచించారు.



