2026 కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్న తరుణంలో, విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి ఆలయం భక్తుల సౌకర్యార్థం కీలక సంస్కరణలను అమలులోకి తీసుకొచ్చింది. కనకదుర్గమ్మను దర్శించుకునే భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఆలయ పాలకమండలి, అధికార యంత్రాంగం సమన్వయంతో మరో ముఖ్య నిర్ణయాన్ని తీసుకుంది.
తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలోనే, ఇక్కడ కూడా ఉచిత లడ్డు ప్రసాదం విధానాన్ని ప్రవేశపెట్టారు. రూ.500/- అంతరాలయ దర్శన టికెట్ పొందిన భక్తులకు ఇకపై ఉచిత లడ్డు ప్రసాదాన్ని నేరుగా టికెట్ స్కానింగ్ పాయింట్ వద్దనే అందించనున్నారు. ఈ విధానం ద్వారా పారదర్శకత పెరగడమే కాకుండా, భక్తుల నుంచి మంచి స్పందన లభిస్తుందని ఆలయ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి టికెట్ స్కానింగ్ పూర్తయిన వెంటనే భక్తులకు లడ్డు అందజేయడం వల్ల ప్రసాద పంపిణీ వ్యవస్థలో స్పష్టత, నమ్మకం మరింత బలపడనుంది. టికెట్ల దుర్వినియోగానికి చెక్ పెట్టడమే కాకుండా, ఆలయ ఆదాయ నిర్వహణలో జవాబుదారీతనాన్ని పెంచే దిశగా ఇది కీలక అడుగుగా భావిస్తున్నారు. గతంలో దర్శనం అనంతరం ప్రసాదం కోసం వేర్వేరు కౌంటర్ల వద్ద వేచిచూడాల్సి వచ్చేది. తాజా మార్పుతో దర్శనానికి ప్రవేశించే స్కానింగ్ పాయింట్ వద్దనే ప్రసాదం లభించడం వల్ల భక్తులకు సమయం ఆదా కానుంది.
ప్రతి భక్తుడికి ప్రసాదం…
స్కానింగ్ పాయింట్ వద్దే ప్రసాద పంపిణీ జరగడం వల్ల ఒక్క భక్తుడూ తన ఉచిత ప్రసాదాన్ని కోల్పోయే పరిస్థితి ఉండదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రతి టికెట్‌కు నిర్ణీత సంఖ్యలో లడ్డులు అందేలా కఠిన పర్యవేక్షణ చేపడతామని వెల్లడించారు. ఈ నూతన విధానాన్ని ప్రవేశపెట్టిన ఆలయ చైర్మన్, ఈవో నిర్ణయాన్ని భక్తులు హర్షాతిరేకాలతో స్వాగతిస్తున్నారు.
దేవస్థాన పాలనలో ఆధునిక సాంకేతికతను సమన్వయం చేస్తూ, భక్తుల రద్దీని సక్రమంగా నియంత్రించడంలో ఈ వినూత్న చర్య ఒక మైలురాయిగా నిలుస్తుందని అధికారులు పేర్కొన్నారు. అమ్మవారిని దర్శించుకునే ప్రతి భక్తుడికి ఆధ్యాత్మికతతో పాటు సంతృప్తికరమైన అనుభూతిని అందించడమే ఈ సంస్కరణల ప్రధాన లక్ష్యమని వారు తెలిపారు.



