అమాయక నిరుద్యోగుల పేర్లతో బ్యాంక్ ఖాతాలు తెరిపించి, వాటిని విదేశాల్లో ఉన్న సైబర్ నేరగాళ్లకు అమ్ముకుంటూ కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు సాగిస్తున్న అంతరాష్ట్ర ముఠాను విజయవాడ పోలీసులు అత్యంత చాకచక్యంగా చేధించారు. ‘అద్దె ఖాతాలు’ అనే ముసుగులో నిరుద్యోగాన్ని ఆసరాగా చేసుకుని దందా చేస్తున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా, ఈ వ్యవహారానికి అంతర్జాతీయ స్థాయి లింకులు ఉన్నట్లు బయటపడటంతో సంచలనం నెలకొంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ ముఠా పేదలు, నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని నగదు ఆశ చూపిస్తూ వారి పేర్లపై కరెంట్ బ్యాంక్ ఖాతాలు తెరిపించేది. అలా విజయవాడకు చెందిన దేవదాసు అనే నిరుద్యోగి పేరుతో ఖాతా తెరిపించి, అతనికి కేవలం రూ.7,000 మాత్రమే ఇచ్చారు. అయితే ఇటీవల తన ఖాతాను పరిశీలించిన దేవదాసు, అందులో ఏకంగా రూ.2 కోట్లకు పైగా లావాదేవీలు జరిగినట్లు గుర్తించి షాక్‌కు గురయ్యాడు. తనకు తెలియకుండానే ఇంత భారీగా డబ్బు తిరిగిన విషయం తెలుసుకున్న అతను వెంటనే పోలీసులను ఆశ్రయించడంతో ఈ భారీ సైబర్ స్కామ్ వెలుగులోకి వచ్చింది.
దర్యాప్తులో పోలీసులు విస్తుపోయే నిజాలను బయటపెట్టారు. ముఠా సేకరించిన బ్యాంక్ ఖాతాల కిట్లు, చెక్‌బుక్స్, డెబిట్ కార్డులను పార్వతి అనే మహిళ ద్వారా ఫిలిప్పీన్స్‌లో ఉన్న ప్రధాన సూత్రధారులకు చేరవేసేవారు. అక్కడి నుంచి ఆన్లైన్ బెట్టింగ్‌లు, సైబర్ మోసాలు, డిజిటల్ ఫ్రాడ్లకు సంబంధించిన అక్రమ సొమ్మును ఈ ఖాతాల్లోకి మళ్లించేవారు. ప్రతి ఖాతాపై ఈ ముఠాకు రూ.30 వేల వరకు కమీషన్ అందినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ ఖాతాల ద్వారా ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, పశ్చిమ బెంగాల్, జమ్మూకశ్మీర్ వంటి పలు రాష్ట్రాల్లో జరిగిన సైబర్ మోసాలకు సంబంధించిన డబ్బును చలామణి చేసినట్లు దర్యాప్తులో తేలింది. ముఠా నాయకుడు సూర్య గతంలో ఆగ్రాలో ఇదే తరహా కేసులో అరెస్టై జైలుకు వెళ్లి వచ్చిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగిస్తూ ఈ అక్రమ దందాను మరింత విస్తరించినట్లు సమాచారం.
ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, నిందితుడు ఉపయోగిస్తున్న కారుపై రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేరుతో ‘ఎమ్మెల్యే’ స్టిక్కర్ ఉండటం. దీని ద్వారా అధికారుల దృష్టిని తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. నిందితుల నుంచి రెండు కార్లు, మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఈ స్కామ్‌లో కీలక పాత్ర పోషించిన పార్వతి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.



