విజయవాడలో దసరా పండుగ సందడి ఈసారి మరింత భిన్నంగా ఉండబోతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా “విజయవాడ ఉత్సవ్” పేరుతో భారీ స్థాయిలో ఉత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు పదిరోజుల పాటు సినీ, సంగీత, సాంస్కృతిక, క్రీడా రంగాల్లో వైవిధ్యభరితమైన కార్యక్రమాలు నగరమంతా సందడిని నింపబోతున్నాయి.
ప్రధాన వేదికలు
ఉత్సవ నిర్వహణ బాధ్యతను శ్రేయాస్ మీడియా చేపట్టగా, కృష్ణానది తీరం, తుమ్మలపల్లి కళాక్షేత్రం, ఘంటసాల సంగీత కళాశాల, ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానం, గొల్లపూడి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వంటి ప్రదేశాలు వేడుకలకు కేంద్రబిందువులుగా మారనున్నాయి.
వేడుకల ముఖ్యాంశాలు
- కృష్ణానదిలో పడవల పోటీలు, జలక్రీడలు
- ప్రకాశం బ్యారేజీపై ప్రతిరోజూ డ్రోన్ షోలు, బాణసంచా ప్రదర్శనలు
- కిడ్స్ జోన్స్, అమ్యూజ్‌మెంట్ పార్క్, షాపింగ్ స్టాళ్లు
- పున్నమిఘాట్ వద్ద ప్రముఖ మ్యూజిక్ బ్యాండ్లు, జానపద కళాకారుల ప్రదర్శనలు
- తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుర్రకథలు, నాటకాలు, నృత్య ప్రదర్శనలు, ప్రవచనాలు
ప్రతిరోజూ ఒక సినీ ప్రీ రిలీజ్ ఈవెంట్
గొల్లపూడిలోని ఎగ్జిబిషన్ మైదానం సినీ అభిమానులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ప్రతి రోజు ఒక ప్రముఖ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.
- సెప్టెంబర్ 22న ఓజీతో ఆరంభం
- అనంతరం అఖండ-2, మన శంకరవరప్రసాద్ చిత్రాల పాటల విడుదలలు, సంగీత కచేరీలు
- రోజువారీగా సినీ తారల హాజరుతో వేడుకలు మరింత రంజుగా మారనున్నాయి.
ప్రత్యేక కార్యక్రమాలు
- మిస్ విజయవాడ పోటీ
- విజయవాడ ఐడల్ – యువ గాయకుల కోసం
- 2కే, 5కే, 20కే మారథాన్ రన్స్
- హెలికాప్టర్ రైడ్స్, హాట్ ఎయిర్ బెలూన్ ప్రయాణాలు
- అగ్ని అవార్డులు – సినీ, సోషల్ మీడియా రంగాల్లో పురస్కారాలు
ప్రముఖుల స్పందన
విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) మాట్లాడుతూ:
“మైసూరు దసరా తరహాలో విజయవాడలో ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తాము. పర్యాటకానికి ఇది పెద్ద స్థాయిలో ఊతం ఇస్తుంది.” అన్నారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ మాట్లాడుతూ:
“దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులు కనీసం రెండు రోజులు విజయవాడలో గడిపి, ఈ ఉత్సవాలను ఆస్వాదించేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం.” అని తెలిపారు.



