వేల కోట్ల రూపాయల కుంభకోణాలు చేసి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా మరియు లలిత్ మోదీ లండన్‌లో ఒకే వేదికపై సందడి చేసిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీరిద్దరూ పాటలు పాడుతూ, డ్యాన్స్ చేస్తూ చల్లగా పార్టీ మూడ్‌లో కనిపించగా, వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ కూడా వారితో కలసి ఎంజాయ్ చేశాడు.
లండన్‌లో విలాసవంతమైన వేడుక
లలిత్ మోదీ ఇటీవల లండన్‌లో ఏర్పాటు చేసిన ఒక ప్రైవేట్ పార్టీకి 300 మందికి పైగా అతిథులు హాజరయ్యారు. ఈ వేడుకలో మాల్యా, మోదీ కలిసి “I Did It My Way” అనే పాట పాడుతూ, స్టేజ్‌పై డ్యాన్స్ చేశారు. వారితో పాటు క్రిస్ గేల్ కూడా జాయిన్ అవడంతో పార్టీలో మరింత కలర్ వచ్చింది. గేల్, మోదీకి బ్యాట్‌తో సంతకం చేసి గిఫ్ట్‌గా అందించారు.
వైరల్ అయిన వీడియోలు, నెటిజన్ల ఆగ్రహం
ఈ పార్టీ వీడియోలు లలిత్ మోదీ స్వయంగా తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేస్తూ, “ఇంటర్నెట్‌ను బ్రేక్ చేయడానికే పెట్టాం.. అదే నా స్టైల్” అని రాసారు. క్రిస్ గేల్ కూడా ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు పోస్ట్ చేయడంతో వైరల్ అవడం శరవేగంగా సాగుతోంది. అయితే వీరి పార్టీపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు – “భారతదేశాన్ని ముంచి విదేశాల్లో ఇలా చిల్లరగా ఎంజాయ్ చేస్తున్నారా?” అంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
దేశానికి పారిపోయిన వారు.. పార్టీలు మాత్రం స్టైల్‌గా!
2010 నుంచి లండన్‌లో నివసిస్తున్న లలిత్ మోదీపై మనీ లాండరింగ్ సహా పలు ఆర్థిక అవకతవకల ఆరోపణలున్నాయి. అదే విధంగా, విజయ్ మాల్యా రూ. 9,000 కోట్ల రుణాలను ఎగ్గొట్టి కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ వ్యవహారంలో చిక్కుకున్నాడు. ఈ ఇద్దరినీ ఇండియాకు రప్పించేందుకు కేంద్రం తరపున తరచూ ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ, వారు అక్కడ జీవితాన్ని ఏ మాత్రం తక్కువగా ఎంజాయ్ చేయడం లేదు అనే విమర్శలు వినిపిస్తున్నాయి.



