డబ్బు మనిషి జీవితానికి అవసరం. పుట్టుక నుంచి చావు వరకు ప్రతి దశలోనూ అది కీలక పాత్ర పోషిస్తుంది. కానీ ఆ డబ్బు కోసం చేసే మార్గమే మనిషి విలువను నిర్ణయిస్తుంది. నిజాయితీగా, శ్రమతో సంపాదించిన డబ్బుకే అర్థం ఉంటుంది. అయితే కొంతమంది మాత్రం సులువైన లాభాల కోసం నీతి–నిజాయితీలను పక్కనబెట్టి దారుణాలకు తెగబడుతున్నారు. మానవత్వాన్ని మరిచి, సమాజానికి మచ్చ తీసుకొచ్చే నేరాలకు పాల్పడుతున్నారు. అలాంటి ఒక షాకింగ్ ఘటన మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలం వెంకటరావుపేట గ్రామంలో వెలుగుచూసింది.
ఏం జరిగిందంటే…
వెంకటరావుపేటకు చెందిన 31 ఏళ్ల వ్యక్తి కరీంనగర్‌లో స్థిరపడి మార్బుల్ వ్యాపారం, ఇంటీరియర్ డెకరేషన్ పనులు చేసేవాడు. మంచిర్యాల ప్రాంతానికి చెందిన 29 ఏళ్ల మహిళను వివాహం చేసుకున్న అతడికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే వ్యాపారంలో భారీ నష్టాలు రావడంతో తీసుకున్న రుణాలు, ఈఎంఐలు చెల్లించడం కష్టంగా మారింది. అప్పుల ఒత్తిడిలో అతడు నేరపథాన్ని ఎంచుకున్నాడు.
భార్యతో కలిసి సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టించడం ప్రారంభించాడు. ఆ పోస్టులే అతడి కుట్రకు ఆయుధంగా మారాయి.
వలలో చిక్కిన బాధితులు…
ఆమె పెట్టే రెచ్చగొట్టే పోస్టులు చూసి కొందరు వ్యాపారులు, యువకులు ఆకర్షితులయ్యారు. వారిని ఆమె అపార్ట్మెంట్‌కు పిలిపించి అత్యంత సన్నిహితంగా వ్యవహరించేది. ఆ సమయంలో భర్త రహస్యంగా వీడియోలు తీసేవాడు. తర్వాత వాటిని బాధితులకు పంపించి, “ఇవి బయటపెడతాం” అంటూ బెదిరింపులకు దిగేవాడు.
గత మూడు సంవత్సరాల కాలంలో ఇలా వంద మందికి పైగా పురుషులను బ్లాక్‌మైల్ చేసి డబ్బులు వసూలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. కరీంనగర్‌కు చెందిన ఓ లారీ వ్యాపారిని కూడా ఇదే విధంగా బెదిరించి రూ.13 లక్షలు దండుకున్నారు. మరింతగా మరో రూ.5 లక్షలు డిమాండ్ చేయడంతో ఆ వ్యాపారి పోలీసులను ఆశ్రయించాడు.
ఖరీదైన జీవితం…
బ్లాక్‌మైల్ ద్వారా వచ్చిన డబ్బుతో ఆ దంపతులు విలాసవంతమైన జీవితం గడిపారు. కారు కొనుగోలు చేయడం, ఖరీదైన సోఫా సెట్లు, ఫర్నిచర్ సమకూర్చుకోవడం వంటి ఖర్చులతో ఆస్తులు కూడబెట్టారు. అంతేకాదు, కరీంనగర్ జిల్లాకు చెందిన మరో వ్యాపారిని కూడా ఆ మహిళ తన మాయలో పడేసింది. అతడు మద్యం మత్తులో ఉన్న సమయంలో పెద్ద మొత్తంలో డబ్బు తీసుకుంది. చివరికి అతడు పూర్తిగా దివాళా తీసే స్థితికి చేరాడు.
డబ్బులు అయిపోయాయని అతడు ఆమె వద్దకు వెళ్లడం మానేయడంతో, ఆమె వాట్సాప్ కాల్ చేసి మానసికంగా ఒత్తిడి తెచ్చింది. “నువ్వు రావడం మానేశావు” అంటూ భావోద్వేగంగా మాట్లాడింది. డబ్బుల్లేవని చెప్పిన అతడికి, ఆమె అతనితో ఉన్న సన్నిహిత వీడియోలను పంపించి మరింత డబ్బు కోసం బెదిరించింది. ఈ వ్యవహారాన్ని తట్టుకోలేక అతడూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
నేరాల పరంపరకి తెర…
వరుస ఫిర్యాదులతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టి, ఆ భార్యాభర్తల బూతు బాగోతాన్ని బయటపెట్టారు. చివరికి ఆ దంపతులను అరెస్టు చేసి జైలుకు పంపించారు. డబ్బు కోసం మానవత్వాన్ని తాకట్టు పెట్టిన ఈ ఘటన సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది.



