ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితకు స్వయంగా ఒక చేదు అనుభవం ఎదురైంది. ఆమె స్వస్థలమైన పాయకరావుపేట నియోజకవర్గంలో ఇటీవల ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ బాలికల హాస్టల్‌ను సందర్శించిన అనిత, విద్యార్థినులతో ముచ్చటించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అయితే, విద్యార్థులతో కలిసి భోజనం చేస్తుండగా ఒక్కసారిగా భోజనంలో బొద్దింక కనిపించింది. దీనిపై మంత్రిగారు తీవ్రంగా స్పందించారు. “ఇలాంటి భోజనాన్ని విద్యార్థులకు పెడుతున్నారా?” అంటూ వంటమనుషులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సన్న బియ్యం వాడాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నప్పటికీ, వాటిని పట్టించుకోకుండా పాతపద్దతుల్లోనే వంట చేస్తున్నారని మండిపడ్డారు.
ఈ ఘటనపై వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. “హోంమంత్రికే ఇలాంటి అనుభవం వస్తే, విద్యార్థుల పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో” అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
మరోవైపు, హాస్టల్ వార్డెన్ పరామర్శ సమయంలో అక్కడ లేరు. భోజన మెనూ సక్రమంగా అమలు కావడం లేదని మంత్రి గుర్తించారు. దీంతో వెంటనే సమగ్ర విచారణ జరిపించి రెండు రోజుల్లో నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. హాస్టల్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటుపరచాలని కూడా సూచించారు.
విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలంటే, హాస్టల్ వసతుల్లో నాణ్యత అత్యవసరం అని మంత్రి అనిత పేర్కొన్నారు.



