వైకుంఠ ఏకాదశి సందర్భంగా అక్షరాల కీర్తనలతో శ్రీవెంకటేశ్వర స్వామి చిత్రం

వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాల పట్టణానికి చెందిన చిత్రకారుడు కోటేష్ భక్తిని కళతో మేళవిస్తూ వినూత్నంగా ఆకట్టుకున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రాన్ని సాధారణ రీతిలో కాకుండా, స్వామికి అత్యంత ప్రియమైన భక్తుడు తాళ్లపాక అన్నమాచార్యులు రచించిన కీర్తనల అక్షరాలతో తీర్చిదిద్దారు. ఈ ప్రత్యేక కళాఖండం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది.

అన్నమయ్య కీర్తనల అక్షరాలను ఉపయోగించి దేవదేవుడి రూపాన్ని ఆవిష్కరించడం ద్వారా చిత్రకారుడు తన ప్రతిభను మరోసారి నిరూపించారు. ఈ చిత్రాన్ని చూసిన వెంకటేశ్వర స్వామి భక్తులు, స్థానిక ప్రముఖులు చిత్రకారుడిని ప్రశంసలతో ముంచెత్తారు. భక్తి, సాహిత్యం, కళ మూడింటి సమ్మేళనంగా ఈ చిత్రం నిలిచిందని వారు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా చిత్రకారుడు కోటేష్ మాట్లాడుతూ.. వైకుంఠ ఏకాదశి ప్రాధాన్యతను గుర్తుచేస్తూ ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలిపారు. ఈ కళాఖండాన్ని పూర్తి చేయడానికి దాదాపు మూడు గంటల సమయం పట్టిందన్నారు. ఏ3 డ్రాయింగ్ షీట్‌పై ముందుగా ఎలాంటి గీతలు వేయకుండా, కేవలం కలర్ పెన్‌లు, వాటర్ కలర్స్‌తోనే చిత్రాన్ని రూపొందించినట్లు చెప్పారు.

వైకుంఠ ఏకాదశి మహా విష్ణువుకు అత్యంత పవిత్రమైన రోజు అని, ఈ రోజున మూడు కోట్ల మంది దేవతలు వైకుంఠానికి వెళ్లి శ్రీ మహా విష్ణువును పూజిస్తారని పురాణాలు చెబుతున్నాయని కోటేష్ వివరించారు. అందుకే ఈ పర్వదినాన్ని ముక్కోటి ఏకాదశిగా పిలుస్తారని అన్నారు. ఈ రోజున మహా విష్ణువు వైకుంఠం నుంచి గరుడ వాహనంపై భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తారని విశ్వాసం.

యుగాల ప్రకారం మహా విష్ణువు వివిధ అవతారాలలో భక్తులకు దర్శనమిచ్చాడని ఆయన గుర్తు చేశారు. త్రేతాయుగంలో శ్రీరాముడిగా, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడిగా, కలియుగంలో శ్రీవెంకటేశ్వర స్వామిగా అవతరించారని తెలిపారు. వైకుంఠ ఏకాదశి రోజున విష్ణు సహస్రనామ పారాయణం, గోవింద నామ స్మరణ చేయడం, వైష్ణవ ఆలయ దర్శనం చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయని నమ్మకం ఉందన్నారు.

అన్నమయ్య పూర్తి పేరు తాళ్లపాక అన్నమాచార్యులు అని, ఆయన తెలుగు సాహిత్యంలో తొలి వాగ్గేయకారుడిగా, పదకవిత పితామహుడిగా గుర్తింపు పొందారని కోటేష్ చెప్పారు. దాదాపు 32 వేల కీర్తనలను శ్రీ వెంకటేశ్వర స్వామిపై రచించి భక్తి భావాన్ని ప్రపంచానికి చాటిన మహానుభావుడని కొనియాడారు. అన్నమయ్య తెలుగు వారిగా పుట్టడం తెలుగు ప్రజలకు వరమని అభివర్ణించారు.

ఆ మహానుభావుడు రచించిన కీర్తనల అక్షరాలతోనే ఈసారి శ్రీవెంకటేశ్వర స్వామి చిత్రాన్ని వినూత్నంగా రూపొందించినట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి రోజున స్వామి చిత్రాలు వేస్తున్నానని, ఈసారి ప్రత్యేకంగా అక్షరాలతో చిత్రాన్ని రూపొందించానని చెప్పారు. హిందూ భక్తులందరిపై స్వామి కృప, ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని చిత్రకారుడు ఆకాంక్షించారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి