ఉత్తరాఖండ్‌లో తరచూ జరుగుతున్న విద్యుత్ కోతలకు నిరసనగా ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే వినూత్నంగా ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా స్వయంగా విద్యుత్ స్తంభం ఎక్కి, ఉన్నతాధికారుల నివాసాలకు కరెంట్ కట్ చేయడం సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళితే.. ఝాబ్రేరా నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరేంద్ర, తన నియోజకవర్గంలో రోజూ 5 నుంచి 8 గంటలపాటు విద్యుత్ కోతలు విధిస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విద్యుత్ కోతల కారణంగా సామాన్య ప్రజలతో పాటు చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మీడియాకు తెలిపారు.
పది రోజుల క్రితమే ఈ సమస్యను విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లానని ఎమ్మెల్యే వీరేంద్ర చెప్పారు. అయినప్పటికీ అధికారులు స్పందించకపోవడం, సమస్యను పట్టించుకోకపోవడం వల్లే ఈ విధమైన నిరసనకు దిగాల్సి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు.
అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా ఎమ్మెల్యే వీరేంద్ర స్వయంగా విద్యుత్ స్తంభం ఎక్కి ఆందోళన చేపట్టారు. అనంతరం బోట్ క్లబ్ ప్రాంతంలో ఉన్న విద్యుత్ శాఖ ఉన్నతాధికారుల నివాసాలకు కరెంట్ సరఫరాను నిలిపివేశారు. సూపరింటెండెంట్ ఇంజినీర్ వివేక్ రాజ్‌పుత్ అధికార నివాసంతో పాటు, చీఫ్ ఇంజినీర్ అనుపమ్ సింగ్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వినోద్ పాండే నివాసాలకు కూడా విద్యుత్ కట్ చేశారు.
ఈ ఘటనపై విద్యుత్ శాఖ అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ముందస్తు చర్యలు లేకుండా విద్యుత్ లైన్లను కట్ చేయడం ప్రమాదకరమని, దీని వల్ల పెద్ద ప్రమాదం సంభవించే అవకాశం ఉందని పేర్కొంటూ ఎమ్మెల్యే వీరేంద్రపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ చర్చకు దారితీసింది.



