యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ లేదన్న కేంద్రం స్పష్టం – రూ.2 వేలకుపైగా ట్రాన్సాక్షన్‌లపై వదంతులకు ముగింపు

upi-transactions-gst-fake-rumours-central-government-clarification

గత కొన్ని రోజులుగా రూ.2వేలకుపైగా యూపీఐ (UPI) లావాదేవీలపై జీఎస్టీ (GST) విధిస్తారన్న వార్తలు విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. దీనివల్ల ప్రజల్లో, ముఖ్యంగా చిన్న, మధ్యతరహా వ్యాపారవర్గాల్లో గందరగోళం నెలకొంది. అయితే ఈ వదంతులకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒకసారి మరింత స్పష్టతనిచ్చింది.

రాజ్యసభలో మాట్లాడిన ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి మాట్లాడుతూ, “యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధించాలన్న దిశగా ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అలాగే ఈ అంశాన్ని జీఎస్టీ కౌన్సిల్ కూడా పరిగణనలోకి తీసుకోలేదు,” అని వెల్లడించారు.

కర్ణాటక వ్యాపారులకు జారీ చేసిన నోటీసులపై వివరణ

ఇటీవల కర్ణాటకలోని కొంతమంది చిన్న వ్యాపారులకు జారీ అయిన జీఎస్టీ నోటీసులపై కూడా కేంద్రం స్పందించింది. ఈ నోటీసులు కేంద్ర ప్రభుత్వం తరఫున కాకుండా, కర్ణాటక రాష్ట్ర వాణిజ్య పన్ను శాఖ వారు తమ అధికార పరిధిలోనే జారీ చేశారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు.

జీఎస్టీ వ్యవస్థలో రెండు విభాగాలున్నాయని ఆయన వివరించారు — కేంద్రానికి చెందిన CGST, రాష్ట్రానికి చెందిన SGST. కర్ణాటక వాణిజ్య పన్ను శాఖ తమ పరిధిలో ఉన్న వ్యాపారులకు నోటీసులు పంపిందని, ఇది కేంద్రానికి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.

వదంతులకు తుది గీత

ప్రస్తుతం UPI ఆధారిత డిజిటల్ లావాదేవీలపై ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని కేంద్రం హామీ ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఎలాంటి జీఎస్టీ పన్నులు యూపీఐ ట్రాన్సాక్షన్‌లపై అమలు చేయడం లేదని, ప్రజలు నిర్భయంగా డిజిటల్ పేమెంట్స్‌ను కొనసాగించాలని సూచించింది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి