ఉత్తరప్రదేశ్‌లో విషాదం: గంటల్లోనే ముగ్గురు చిన్నారుల మృతి – గ్రామంలో భయాందోళనలు

తల్లిదండ్రుల కళ్లముందే చిన్నారులు చివరి శ్వాస విడిస్తే… ఆ హృదయ విదారక వేదనను మాటల్లో చెప్పడం అసాధ్యం. ఒక బిడ్డను కోల్పోవడమే కుటుంబాన్ని చీకట్లో నెట్టేస్తుంది. అయితే గంటల్లోనే ముగ్గురు పిల్లలు ప్రాణాలు కోల్పోతే? ఆ బాధను ఊహించడం కూడా కాలేదు. ఇటీవ‌ల తెలంగాణలో జరిగిన బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కుమార్తెల మృతి దేశాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అలాంటి మరో విషాదం ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. మరింత మానసిక వేదన కలిగించే విషయం ఏమిటంటే… ఈసారి ప్రాణాలు కోల్పోయిన వారు ఏడేళ్ల లోపు చిన్నారులు.

ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ జిల్లా, నెబువా నౌరంగియా బ్లాక్‌లోని గులార్హియా తోలా గ్రామంలో పింటు గౌర్ కుటుంబం నివసిస్తోంది. ఒక చిన్న గ్రామం… సాధారణ కుటుంబం… అయితే వారిపై పడిన ఈ విషాదం గ్రామాన్నే గాఢ విషాదంలో ముంచేసింది.

సుమారు వారం రోజుల క్రితం గౌర్ పెద్ద కుమార్తె మంజు (7)కు తీవ్రమైన జ్వరం వచ్చింది. ఇంట్లో వారు ఆందోళన చెందడంతో వెంటనే స్థానిక వైద్యుడిని సంప్రదించారు. మందులు ఇచ్చినా జ్వరం తగ్గకపోవడంతో, చిన్నారి ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో ఆమెను మరో ఆసుపత్రికి తరలించారు. గంటలకొద్దీ చికిత్స అందించినా, వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు. మంజు అక్కడే ప్రాణాలు కోల్పోయింది.

ఇదే సమయంలో ఎవ్వరూ ఊహించని ఘోరం జరిగింది. మంజు మృతదేహం ఇంకా ఇంటికే రాలేదంటే… గంటల్లోనే ఆమె చెల్లె ఖుషి (3), తమ్ముడు కృష్ణ (5) కూడా ఒక్కొక్కరుగా జ్వరంతో కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రులకు తీసుకెళ్లేలోపే ఈ ఇద్దరూ కూడా ప్రాణాలు విడిచారు. ఒకేరోజు, కొన్ని గంటల వ్యవధిలోనే మూడు అమాయక జీవాలు దూరమవడం గ్రామంలో భయాందోళనలకు కారణమైంది.

ఏదో అంటువ్యాధి గ్రామంలో విస్తరిస్తోందా? పిల్లలు మరణించిన తీరు చూస్తే… గ్రామస్తులందరూ భయంతో ఇళ్లలోనే ఉండిపోవడం ప్రారంభించారు. వరుసగా చిన్నారుల మరణాలు చోటుచేసుకోవడంతో జిల్లా వైద్యశాఖ అప్రమత్తమైంది.

వైద్య అధికారుల బృందాలు వెంటనే గ్రామానికి చేరుకుని సమగ్ర పరిశీలన ప్రారంభించాయి. మరణించిన ముగ్గురు పిల్లలు ఏ రకమైన ఇన్ఫెక్షన్‌కు గురయ్యారో తెలుసుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు జరుగుతోంది. ముఖ్యంగా మలేరియా, డెంగీ, వైరల్ ఫీవర్, స్క్రబ్ టైఫస్ వంటి వ్యాధులపై కేంద్రీకరించి పరీక్షలు చేస్తున్నారు.

ఇప్పటివరకు గ్రామంలోని 57 మంది పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. జ్వరం, వాంతులు, నీరసం వంటి లక్షణాలతో ఉన్న చిన్నారులను వెంటనే చికిత్సకు తరలించారు. గ్రామంలో అంబులెన్స్, వైద్య బృందాలు శాశ్వతంగా మోహరించడానికి ఏర్పాట్లు చేశారు.

స్థానిక ప్రజారోగ్య శాఖ పారిశుధ్యంపై దృష్టి సారించింది. గ్రామంలోని కాలువలు, చెత్త ప్రదేశాలు శుభ్రం చేస్తూ, దోమలు పెరిగే ప్రాంతాల్లో ఫాగింగ్ నిర్వహిస్తున్నారు. తాగునీటి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించారు.

అయితే గ్రామ ప్రజలు ఇంకా భయంతోనే ఉన్నారు. గంటల్లో మూడు ప్రాణాలు కోల్పోవడం… తల్లిదండ్రుల స్థితి చూసేవారి హృదయాలను కదిలిస్తోంది. ఈ సంఘటనకు గల కారణాలు ఏమిటి? చిన్నారులను ప్రాణాలు తీసిన వ్యాధి ఏది? అధికారుల దర్యాప్తు రిపోర్టుపై ఇప్పుడు అందరి చూపు నిలిచింది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి