ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో శుక్రవారం ఉదయం అనూహ్య పరిస్థితులు ఏర్పడ్డాయి. ‘విజన్ 2047’ అంశంపై చర్చ జరుగుతున్న సమయంలో మధుర ఎమ్మెల్యే రాజేష్ చౌదరి, వారణాసి ఎమ్మెల్యే సౌరభ్ శ్రీవాస్తవ మధ్య వాగ్వాదం చెలరేగింది. మాటల యుద్ధం కొట్టుకునే స్థాయికి చేరగా, ఇతర ఎమ్మెల్యేలు మధ్యలో అడ్డుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
అసలు వివాదం ఏంటంటే?
స్పీకర్‌కు చర్చలో మాట్లాడే వారి పేర్లు పంపే సమయంలో, సౌరభ్ శ్రీవాస్తవ తన పేరు అడ్డుకున్నారని రాజేష్ చౌదరి ఆరోపించారు. దీనిపై కోపంతో ఇద్దరూ ఒకరిపై ఒకరు గట్టిగా అరవడంతో అసెంబ్లీ హాల్ ఉద్రిక్తమైంది.
వీడియో వైరల్ – అఖిలేష్ యాదవ్ విమర్శ
ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా పంచబడింది. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఈ వీడియోను ‘ఎక్స్’లో షేర్ చేస్తూ, “ఇదేనా బీజేపీ సంస్కారం?” అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య వేదికల్లో ఇలాంటి ప్రవర్తన తగదని తీవ్ర విమర్శలు గుప్పించారు.
రాజేష్ చౌదరి కౌంటర్
అఖిలేష్ వ్యాఖ్యలకు ప్రతిస్పందిస్తూ రాజేష్ చౌదరి, మౌలానా సాజిద్ రషీదీ డింపుల్ యాదవ్పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై అఖిలేష్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఈ మాటల యుద్ధంతో వివాదం మరింత ముదిరింది.



