టైప్-సి పోర్ట్‌తో ఫోన్‌ను పవర్ బ్యాంక్, ల్యాప్‌టాప్‌గా మార్చుకోవచ్చా? ఈ ఉపయోగాలు తెలుసా!

చాలా మంది స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు టైప్-సి పోర్ట్‌ను కేవలం బ్యాటరీ ఛార్జింగ్‌కే పరిమితం చేస్తుంటారు. కానీ నిజానికి ఈ చిన్న పోర్ట్ మీ ఫోన్‌కు అద్భుతమైన మల్టీ-టాలెంట్‌ను ఇస్తుంది. అవసరమైతే అదే పోర్ట్‌తో మీ ఫోన్ పవర్ బ్యాంక్‌గా, ల్యాప్‌టాప్‌లా, మీడియా హబ్‌లా కూడా మారిపోతుంది. టైప్-సి పోర్ట్‌తో మీరు చేయగల ఆశ్చర్యకరమైన ఉపయోగాలు ఇవే.

◆ 1. మీ ఫోన్‌ను పవర్ బ్యాంక్‌లా వాడండి

సాధారణంగా ఇతర పరికరాలను ఛార్జ్ చేయడానికి పవర్ బ్యాంక్ అవసరం అవుతుంది. కానీ టైప్-సి టు టైప్-సి కేబుల్ ఉంటే, మీ ఫోన్ నుంచే ఇతర పరికరాలకు ఛార్జ్ ఇవ్వొచ్చు. ఇయర్ బడ్స్, స్మార్ట్‌వాచ్‌లు లేదా చిన్న బ్యాటరీ ఉన్న మరో ఫోన్‌ను అత్యవసర సమయంలో సులభంగా ఛార్జ్ చేయవచ్చు. ప్రయాణాల్లో లేదా ఛార్జర్ లేనప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది.

◆ 2. ఫైల్స్‌ను అతి వేగంగా బదిలీ చేయండి

క్విక్ షేర్, ఎయిర్‌డ్రాప్ లాంటి వైర్‌లెస్ ఫీచర్లు ఉన్నప్పటికీ, పెద్ద వీడియోలు లేదా డేటా బదిలీకి అవి కొన్నిసార్లు నెమ్మదిగా పనిచేస్తాయి. అలాంటి సమయంలో రెండు ఫోన్లను టైప్-సి కేబుల్ ద్వారా కనెక్ట్ చేస్తే, డేటా నేరుగా, వేగంగా, ఎలాంటి నెట్‌వర్క్ అవసరం లేకుండా ట్రాన్స్‌ఫర్ అవుతుంది.

◆ 3. ఫోన్‌ను చిన్న ల్యాప్‌టాప్‌లా మార్చుకోండి

టైప్-సి పోర్ట్‌కు OTG అడాప్టర్ లేదా బ్లూటూత్ డోంగిల్ కనెక్ట్ చేస్తే, కీబోర్డ్ మరియు మౌస్‌ను మీ ఫోన్‌కు జత చేయవచ్చు. దీని ద్వారా డాక్యుమెంట్లు టైప్ చేయడం, బ్రౌజింగ్ చేయడం చాలా సులభం అవుతుంది. టచ్ స్క్రీన్ పని చేయని పరిస్థితుల్లో కూడా మౌస్‌తో ఫోన్‌ను పూర్తిగా ఆపరేట్ చేయవచ్చు.

◆ 4. టీవీకి కనెక్ట్ చేసి పెద్ద తెరపై సినిమాలు

HDMI టు టైప్-సి కేబుల్ సహాయంతో మీ ఫోన్‌ను నేరుగా టీవీకి కనెక్ట్ చేయవచ్చు. ఫోన్ స్క్రీన్ మొత్తం టీవీలో కనిపిస్తుంది. సినిమాలు, వెబ్ సిరీస్‌లు, యూట్యూబ్ వీడియోలను పెద్ద స్క్రీన్‌పై చూసేందుకు ఇది బెస్ట్ ఆప్షన్.

◆ 5. వైర్డ్ ఇయర్ ఫోన్స్‌తో మెరుగైన ఆడియో అనుభవం

చాలా కొత్త ఫోన్లలో 3.5mm హెడ్‌ఫోన్ జాక్ లేకపోవడంతో చాలామంది వైర్‌లెస్ ఇయర్ బడ్స్‌కి అలవాటు పడుతున్నారు. కానీ టైప్-సి పోర్ట్ ద్వారా వైర్డ్ ఇయర్ ఫోన్స్‌ను ఉపయోగించవచ్చు. వైర్‌లెస్‌తో పోలిస్తే వైర్డ్ ఇయర్ ఫోన్స్‌లో ఆడియో క్వాలిటీ మెరుగ్గా ఉంటుంది, ల్యాగ్ ఉండదు. ముఖ్యంగా గేమింగ్ చేసే వారికి ఇది చాలా ఉపయోగకరం. ఇందుకోసం టైప్-సి ఇయర్ ఫోన్స్ లేదా టైప్-సి టు 3.5mm అడాప్టర్ అవసరం.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి