ప్రఖ్యాత కాలర్ ఐడీ యాప్ ట్రూకాలర్ భారత ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం మరో కీలక అడుగు వేసింది. గురువారం ‘ట్రూకాలర్ వాయిస్‌మెయిల్’ పేరుతో శక్తివంతమైన, ఉచిత ఏఐ ఆధారిత ఫీచర్‌ను విడుదల చేసింది. ఈ సదుపాయం ద్వారా వాయిస్ మెసేజ్‌లను తక్షణమే టెక్ట్స్‌గా (ట్రాన్స్‌క్రిప్షన్) మార్చుకునే అవకాశం లభిస్తుంది. ముఖ్యంగా స్పామ్ కాల్స్‌ను ఆటోమేటిక్‌గా గుర్తించి అడ్డుకునేలా దీనిని డిజైన్ చేశారు.
సాంప్రదాయ వాయిస్‌మెయిల్ విధానానికి భిన్నంగా, ఈ మెసేజ్‌లు నేరుగా యూజర్ ఫోన్‌లోనే స్టోర్ అవుతాయి. దీంతో రికార్డింగ్‌లపై పూర్తి నియంత్రణతో పాటు గోప్యత కూడా భద్రంగా ఉంటుంది. పిన్ నంబర్లు గుర్తుపెట్టుకోవడం, ప్రత్యేక నంబర్లకు డయల్ చేయడం వంటి తలనొప్పులు ఇక అవసరం లేదు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడతో పాటు మొత్తం 12 భారతీయ భాషల్లో వాయిస్‌మెయిల్‌ను టెక్ట్స్‌గా మార్చుకునే సౌకర్యాన్ని ట్రూకాలర్ అందిస్తోంది. మీటింగ్‌లో ఉన్నప్పుడు లేదా వినలేని పరిస్థితుల్లో కూడా వాయిస్ మెసేజ్‌లను సులభంగా చదివే వెసులుబాటు కలుగుతుంది.
ఈ కొత్త ఫీచర్‌పై ట్రూకాలర్ సీఈఓ రిషిత్ ఝున్‌ఝున్‌వాలా మాట్లాడుతూ, “సాంప్రదాయ వాయిస్‌మెయిల్ పాత తరం కమ్యూనికేషన్‌కు పరిమితమైంది. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ఆ విధానాన్ని మేము పూర్తిగా మార్చుతున్నాం. వాయిస్ మెసేజ్‌లు ఉచితంగా, నేరుగా ఫోన్‌లోనే స్టోర్ అయ్యేలా, స్పామ్ ప్రొటెక్షన్‌తో అందిస్తున్నాం. నేటి కమ్యూనికేషన్ విధానానికి సరిపోయేలా ఈ ఫీచర్‌ను రూపొందించాం” అని తెలిపారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 45 కోట్ల మందికి పైగా ట్రూకాలర్‌ను వినియోగిస్తున్నారు. కేవలం 2024 సంవత్సరంలోనే ఈ యాప్ సుమారు 56 బిలియన్ల స్పామ్ కాల్స్‌ను గుర్తించి బ్లాక్ చేయడం గమనార్హం.


