హీరో అయినా హీరోయిన్ అయినా తెరపై అందంగా కనిపించాలంటే మేకప్ తప్పనిసరి అన్న భావన సాధారణంగా ఉంటుంది. అయితే ఈ ట్రెండ్‌ను బ్రేక్ చేస్తూ, మేకప్ లేకుండా సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే కొద్ది మంది హీరోయిన్లు మాత్రమే ఇండస్ట్రీలో ఉన్నారు. సాయి పల్లవి తరహాలోనే మరో హీరోయిన్ కూడా ఇదే బాటలో నడుస్తూ స్టార్ స్టేటస్ సాధించింది.
పై ఫొటో చూసి చాలా మంది మొదట అబ్బాయి అనుకుంటారు. కానీ ఆమె ఇప్పుడు దక్షిణాది సినీ పరిశ్రమలో వరుస హిట్లతో దూసుకుపోతున్న స్టార్ హీరోయిన్. తెలుగులో నేరుగా నటించకపోయినా, డబ్బింగ్ సినిమాలు, వెబ్ సిరీసుల ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. కమర్షియల్ హంగులు, ఆర్భాటాలకు దూరంగా ఉంటూ కథా ప్రాధాన్యమున్న సినిమాలనే ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది.
ఈ ముద్దుగుమ్మ కేరళకు చెందిన నిమిషా సజయన్. మాస్ కమ్యూనికేషన్‌లో డిగ్రీ పూర్తి చేసిన ఆమె, చిన్నప్పటి నుంచే తైక్వాండోలో శిక్షణ పొందింది. బ్లాక్ బెల్ట్ కూడా సాధించిన నిమిషా, యాక్షన్ సన్నివేశాల్లోనూ తన ప్రత్యేకతను చూపిస్తోంది. ఇతర హీరోయిన్లలా వరుసగా అన్ని ఆఫర్లను ఒప్పుకోకుండా, బలమైన కథ ఉన్న సినిమాలకే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఆమె ప్రత్యేకత.
ది గ్రేట్ ఇండియన్ కిచెన్, నాయట్టు, చిన్నా, జిగర్తాండ డబుల్ ఎక్స్, డీఎన్‌ఏ (తెలుగులో ఓ మై బేబీ) వంటి సినిమాలతో నిమిషా సజయన్ నటనకు మంచి గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా డీఎన్‌ఏ సినిమాలో ఆమె చేసిన పాత్రకు ప్రేక్షకులు, విమర్శకులు ప్రశంసల వర్షం కురిపించారు. సినిమాలతో పాటు పోచర్, డబ్బా కార్టెల్ వంటి వెబ్ సిరీసుల్లోనూ నటిస్తూ ఓటీటీ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది.
స్టార్ హీరోయిన్ అయినా సరే, నిజ జీవితంలో ఎంతో సింపుల్‌గా ఉండే నిమిషా, సినిమాల్లో కూడా మేకప్ లేకుండా నటించడానికి ఇష్టపడుతుందని పలు ఇంటర్వ్యూలలో చెప్పింది. అదే ఆమెను మిగతా హీరోయిన్లకు భిన్నంగా నిలబెడుతోంది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలు, వెబ్ సిరీసులతో బిజీగా ఉన్న ఈ నేచురల్ బ్యూటీ, భవిష్యత్తులో మరిన్ని వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉంది.



