తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో తీవ్రమైన దారుణం బయటపడింది. బీఈడీ చదువుతున్న ఒక విద్యార్థినిపై అసిస్టెంట్ ప్రొఫెసర్ లైంగిక దాడికి పాల్పడగా, మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆ దృశ్యాలను రహస్యంగా వీడియో తీశి బ్లాక్మెయిల్ చేసిన ఘటన వెలుగులోకి రావడంతో విద్యార్థుల్లో తీవ్ర ఆగ్రహం నెలకొంది. ఈ దాడుల కారణంగా బాధితురాలు గర్భం దాల్చినట్లు తెలిసి ఘటన మరింత కలకలం రేపుతోంది.
వివరాల ప్రకారం, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణకుమార్ కొంతకాలంగా మొదటి సంవత్సరం విద్యార్థినిని ఏకాంతంలోకి దారి మళ్లిస్తూ లైంగికదాడికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారాన్ని మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ శేఖర్‌రెడ్డి గమనించి, విద్యార్థిని–లక్ష్మణకుమార్ మధ్య ఉన్న వ్యక్తిగత క్షణాలను తన మొబైల్లో రహస్యంగా రికార్డ్ చేశాడు. తరువాత ఈ వీడియోను చూపిస్తూ విద్యార్థినిని బెదిరించి, లైంగిక వేధింపులకు దిగినట్లు సమాచారం.
భయంతో, అవమానంతో బాధితురాలు వేధింపులను భరించలేక పది రోజుల క్రితం వర్సిటీ వీసీ కృష్ణమూర్తికి లిఖితపూర్వక ఫిర్యాదు అందజేసింది. ఆ తరువాత ఆమె తమ రాష్ట్రానికి వెళ్లిపోయింది. ఫిర్యాదు అందుకున్న వర్సిటీ అధికారులు అంతర్గత విచారణ కమిటీని ఏర్పాటు చేసి, ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ లక్ష్మణకుమార్‌ను డిసెంబర్ 1న సస్పెండ్ చేశారు.
తాజాగా, బాధితురాలి ఫిర్యాదుతో పాటు విచారణ కమిటీ సేకరించిన ఆధారాలను సమర్పిస్తూ వర్సిటీ ఇన్చార్జి వీసీ రజనీకాంత్ శుక్లా తిరుపతి వెస్ట్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, ఇద్దరు ప్రొఫెసర్ల మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించినట్లు సీఐ మురళీమోహన్ వెల్లడించారు.
ఈ ఘటన వెలుగులోకి రావడంతో వర్సిటీ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. విద్యార్థులు కీచక ప్రవర్తనకు పాల్పడిన ప్రొఫెసర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.



