తమిళనాడు రాష్ట్రం తిరుచ్చి జిల్లాలో ఆదివారం ఉదయం జరిగిన ఓ దారుణ ఘటన స్థానికులను షాక్‌కు గురిచేసింది. తిరుచ్చి పోలీసు క్వార్టర్స్‌లో ఓ ప్రైవేటు కంపెనీ ఉద్యోగిని దుండగులు బహిరంగంగా నరికి హతమార్చారు. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది.
భీమానగర్ తూర్పు వీధిలో నివసిస్తున్న తామరై సెల్వన్ (27) అనే యువకుడు స్థానిక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఏడాది క్రితం వివాహం చేసుకున్న అతడు ప్రతిరోజూ బైకుపై ఆఫీసుకు వెళ్ళి సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చేవాడు.
సాధారణంగా ఉన్న జీవితం సోమవారం ఉదయం ఒక్కసారిగా దారుణంగా మారింది. ఆ రోజు కూడా ఎప్పటిలాగే బైకుపై ఆఫీసుకు బయలుదేరిన తామరై సెల్వన్ పాత పోస్టాఫీస్ రోడ్ వద్దకు చేరుకోగానే గుర్తు తెలియని దుండగులు ఎదురుగా బైకుపై వచ్చి అతని వాహనాన్ని ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టారు.
ఆకస్మికంగా జరిగిన ప్రమాదంతో తామరై సెల్వన్ రోడ్డుపై పడిపోవడంతో, ఆ దుండగులు వెంటనే వేటకొడవళ్లు, కత్తులతో అతడిపై దాడి ప్రారంభించారు. ప్రాణభయంతో పరుగులు తీసిన తామరై సెల్వన్ థిల్లైనగర్‌లోని పోలీసు క్వార్టర్స్‌లో ఏఎస్ఐ సెల్వరాజ్ ఇంట్లోకి దాక్కునేందుకు ప్రయత్నించాడు.
కానీ అతడిని వెంబడించిన దుండగులు ఇంట్లోపలకే చొరబడి, ఏఎస్ఐ కుటుంబ సభ్యులు కళ్లముందే తామరై సెల్వన్‌పై వేటకొడవళ్లతో, కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి దారుణంగా హతమార్చారు. ఈ ఘటనను చూసిన క్వార్టర్స్‌లోని కుటుంబాలు భయంతో గందరగోళానికి గురయ్యాయి.
హంతకులు హత్య అనంతరం అక్కడి నుండి పరారయ్యే ప్రయత్నం చేశారు. వారిని పట్టుకునేందుకు పోలీసు కుటుంబ సభ్యులు ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు. విషయం తెలిసిన వెంటనే తిరుచ్చి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఈ హత్య జరిగిన ప్రదేశం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ బస చేసే ప్రాంతానికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉండటంతో సెక్యూరిటీ వర్గాలు అప్రమత్తమయ్యాయి. తిరుచ్చి నగరంలో భద్రతా చర్యలు కఠినతరం చేశారు.
పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. తాజా సమాచారం ప్రకారం, ఈ ఘటనకు సంబంధించి నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. వ్యక్తిగత వైరం కోణంలో విచారణ కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.



