కేరళ రాష్ట్రం త్రిశూర్ రైల్వే స్టేషన్‌లో తెల్లవారు జామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్టేషన్‌లోని బైక్ పార్కింగ్ ప్రాంతంలో ప్రారంభమైన ఈ మంటలు క్షణాల్లోనే తీవ్రరూపం దాల్చాయి. ప్లాట్‌ఫారమ్ నంబర్–2 సమీపంలో జరిగిన ఈ ఘటనలో 200కు పైగా ద్విచక్ర వాహనాలు పూర్తిగా దగ్ధమై కాలి బూడిదయ్యాయి. ప్రమాదానికి గల అసలు కారణాలు, మొత్తం ఆస్తి నష్టం వివరాలు ఇప్పటివరకు పూర్తిగా వెల్లడికాలేదు.
సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక శాఖ, రెస్క్యూ సిబ్బంది సంఘటనస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. రోజుకు సగటున 500కు పైగా బైక్‌లను నిలిపివుంచే సామర్థ్యం ఉన్న ఈ పార్కింగ్ ప్రాంతంలో, ఘటన సమయంలో అనేక వాహనాలు పార్క్ చేసి ఉండటంతో నష్టం తీవ్రంగా ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మంటల కారణంగా పలు వాహనాల పెట్రోల్ ట్యాంకులు పేలిపోవడంతో ఇంధనం చెలరేగి అగ్ని మరింత వేగంగా వ్యాపించినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు సంభవించకపోవడం ఊరటనిచ్చే అంశం.
అగ్నిప్రమాదం తీవ్రతకు రైల్వే పార్కింగ్ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమై ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, తొలుత ఒకే బైక్ నుంచి స్వల్ప మంటలు చెలరేగాయి. ఆ సమయంలో తగిన అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉండి ఉంటే, పరిస్థితి ఇంతటి విపరీత స్థాయికి చేరేది కాదని వారు చెబుతున్నారు. దీనికి తోడు బలమైన గాలులు వీస్తుండటంతో మంటలు నిమిషాల వ్యవధిలోనే ఇతర వాహనాలకు వ్యాపించాయి. ఈ ఘటనతో ప్రయాణికులు, స్టేషన్ పరిసరాల్లోని స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.
మంటలు పూర్తిగా ఆరిపోయినప్పటికీ, దట్టమైన పొగ కారణంగా ప్రయాణికులు, రైల్వే సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అనేక వాహనాలు పూర్తిగా దగ్ధమవగా, మరికొన్ని పాక్షికంగా దెబ్బతిన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే వాహన యజమానులు పెద్ద సంఖ్యలో సంఘటనస్థలానికి చేరుకున్నారు. వారిలో ఎక్కువ మంది రోజువారీ ప్రయాణికులే కావడంతో, తమ జీవనాధారమైన వాహనాలు కాలి బూడిదవ్వడాన్ని చూసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రమాదంలో ధ్వంసమైన వాహనాల ఖచ్చితమైన సంఖ్యపై అధికారులు ఇంకా అంచనా వేస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణం ప్రస్తుతం స్పష్టంగా తెలియకపోవడంతో, సమగ్ర దర్యాప్తు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ విచారణలో రైల్వే స్టేషన్ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీ కీలకంగా మారనుంది. ఈ ఘటన కారణంగా రైళ్ల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగలేదని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. గురువాయూర్ వైపు వెళ్లే ట్రాక్‌కు సమీపంలో ఉన్నప్పటికీ, సకాలంలో చర్యలు తీసుకోవడం వల్ల మంటలు రైల్వే మౌలిక సదుపాయాలకు వ్యాపించకుండా నివారించగలిగినట్లు తెలిపారు.



