మహారాష్ట్రలోని థానే జిల్లాలో సహజీవనం పేరుతో జరిగిన భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక మహిళను అత్యంత క్రూరంగా హత్య చేసి, ఆ మృతదేహాన్ని సూట్‌కేసులో నింపి కాలువలో పడేసిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. పోలీసులు కేసును ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశారు.
థానే జిల్లా దేశాయ్ గ్రామ సమీపంలోని కాలువ వంతెన కింద సోమవారం ఉదయం స్థానికులకు అనుమానాస్పదంగా ఒక సూట్‌కేసు కనిపించడంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సూట్‌కేసును తెరిచి చూడగా, అందులో ఒక మహిళ మృతదేహం దొరికింది. మృతురాలి మణికట్టుపై ‘P V S’ అనే అక్షరాలతో ఉన్న పచ్చబొట్టు ఆధారంగా పోలీసులు విచారణను ముమ్మరం చేశారు.
సోషల్ మీడియాలో నుంచి సేకరించిన సమాచారం, సమీపంలోని సీసీటీవీ దృశ్యాలు ఆధారంగా దర్యాప్తు సాగించిన పోలీసులు, ఆ మహిళను ప్రియాంక విశ్వకర్మ (22)గా గుర్తించారు. ఆమెతో ఐదేళ్లుగా సహజీవనం చేస్తున్న వినోద్ శ్రీనివాస్ విశ్వకర్మ (50)పై అనుమానం బలపడటంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడు నేరాన్ని అంగీకరించాడు.
నవంబర్ 21 రాత్రి ఇద్దరి మధ్య జరిగిన గొడవలో కోపంతో ప్రియాంకను గొంతు నులిమి హత్య చేసినట్లు అతడు వెల్లడించాడు. మరుసటి రోజు వరకు మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టగా, దుర్వాసన రావడంతో నవంబర్ 22 రాత్రి సూట్‌కేసులో పెట్టి కాలినడకన కాలువ వంతెనపైకి వెళ్లి అందులో పడేసినట్లు ఒప్పుకున్నాడు. నిందితుడిపై హత్య కేసు సహా సాక్ష్యాలను నాశనం చేసినందుకు సంబంధించిన సెక్షన్లతో కేసు నమోదు చేశారు.
తెలంగాణలో మరో ప్రేమకథ విషాదాంతం
థానే ఘటన రాష్ట్రాన్ని కలవరపరిచిన వేళ, తెలంగాణలో కూడా ప్రేమపై నమ్మకం కోల్పోయిన యువ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లోని పోచారం ఐటీ కారిడార్ ప్రాంతంలో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పవన్ కల్యాణ్ రెడ్డి (26), ప్రేమించిన యువతి మోసం చేసిందనే మనస్తాపంతో బలవన్మరణం చెందాడు.
గుంటూరు జిల్లాకు చెందిన పవన్ కల్యాణ్ రెడ్డి నాలుగేళ్లుగా ఇన్ఫోసిస్‌లో పని చేస్తూ, పోచారంలోని సంస్కృతి టౌన్‌షిప్‌లో స్నేహితులతో అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. అతడు కొంతకాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. వివాహం చేసుకోవాలన్న ఉద్దేశంతో ఇద్దరూ శారీరకంగా దగ్గరయ్యారని సమాచారం. అయితే ఇటీవల ఆ యువతి వేరొక వ్యక్తితో ఉన్న కొన్ని ఫొటోలు చూసిన పవన్ కల్యాణ్ రెడ్డి తీవ్ర అనుమానంతో ఆమె కుటుంబ సభ్యులకు ఆ ఫొటోలను పంపించాడు.
దాంతో ఆ యువతి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో పవన్‌పై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. రెండు రోజులు అతను ఏ కాంటాక్ట్‌కు స్పందించకపోవడంతో, మానసిక ఒత్తిడికి లోనై సోమవారం ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
స్నేహితుల సమాచారం మేరకు చేరుకున్న అతని తండ్రి శ్రీనివాస్ రెడ్డి, తన కుమారుడి ఆత్మహత్యకు ప్రియురాలి మోసమే కారణమని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోచారం ఐటీ కారిడార్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.



