తెలియని నంబర్ నుంచి కాల్? ఇక ఫోన్ స్క్రీన్‌పైనే కాలర్ పేరు — CNAP ఫీచర్ వివరాలు

తెలియని నంబర్‌ నుంచి కాల్‌ వస్తే అది ఎవరిదో తెలుసుకోవడానికి ‘ట్రూకాలర్’ వంటి యాప్‌లను వాడాల్సిన అవసరం ఇక ఉండకపోవచ్చు. ఇకపై ఎవరు కాల్‌ చేస్తున్నారో నేరుగా మీ ఫోన్‌ స్క్రీన్‌పైనే కనిపించనుంది. ఈ కొత్త సదుపాయాన్ని ‘కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్ (CNAP)’ అని పిలుస్తారు. ఈ ఫీచర్‌ను త్వరలో దేశంలోని అన్ని టెలికాం సంస్థలు ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నాయి.

సిమ్ కార్డు తీసుకునే సమయంలో వినియోగదారుడు ఇచ్చిన గుర్తింపు పత్రంలోని పేరునే ఇన్‌కమింగ్ కాల్ సమయంలో ఫోన్‌ స్క్రీన్‌పై చూపిస్తారు. అంటే, మీరు చూసే పేరు ఆ నంబర్‌ యజమాని అసలు పేరే అవుతుంది. దేశవ్యాప్తంగా 2026 మార్చి నాటికి ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అధికారిక వర్గాలు వెల్లడించాయి.

ఇటీవలి కాలంలో సైబర్ నేరాలు, మోసాలు, ముఖ్యంగా ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో జరుగుతున్న నకిలీ కాల్స్‌ విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో వాటిని అరికట్టడానికి టెలికాం శాఖ (DoT) ఈ CNAP విధానాన్ని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ (TRAI) కూడా ఇప్పటికే ఆమోదం తెలిపింది. కనుక, వినియోగదారుడు సిమ్ తీసుకునేటప్పుడు సమర్పించిన KYC డాక్యుమెంట్స్‌లోని పేరునే భవిష్యత్తులో ఇతరుల ఫోన్లలో ఇన్‌కమింగ్ కాల్ సమయంలో చూపించనున్నారు.

అయితే, ప్రతి ఒక్కరికీ తమ పేరు ఇతరులకు కనిపించాలనిపించకపోవచ్చు. అలాంటి వారికి ‘హైడ్ నేమ్’ అనే ఆప్షన్‌ ఇవ్వనున్నారు. అంటే, మీ పేరు డిస్‌ప్లే కాకుండా ఉండాలనుకుంటే ఆ సదుపాయాన్ని ఎంచుకోవచ్చు.

ఇకపోతే, ఈ కొత్త ఫీచర్‌ను పాత టెక్నాలజీ ఉన్న 2జీ, 3జీ నెట్‌వర్క్‌లలో అమలు చేయడం కష్టంగా ఉండబోతోందని ట్రాయ్, డాట్ అధికారులు తెలిపారు. కాబట్టి ప్రారంభ దశలో 4జీ మరియు 5జీ స్మార్ట్‌ఫోన్‌లలో మాత్రమే ఈ సౌకర్యం లభ్యం కానుంది.

ప్రస్తుతం ఈ ఫీచర్‌ను హర్యానా సర్కిల్‌లో రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా సంస్థలు ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నాయి. వీటి ఫలితాలు సానుకూలంగా ఉన్నాయని సమాచారం. త్వరలోనే దేశవ్యాప్తంగా మిగిలిన టెలికాం కంపెనీలు కూడా దీన్ని అమలు చేసేలా డాట్ (DoT) చర్యలు తీసుకుంటోంది.

2026 మార్చి 31 నాటికి ఈ సేవలను పూర్తిస్థాయిలో వినియోగదారులందరికీ అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమని అధికారులు వెల్లడించారు. ఈ సదుపాయం ద్వారా ఫేక్ కాల్స్‌ సంఖ్య తగ్గిపోవడంతో పాటు వినియోగదారుల భద్రత మరింతగా పెరుగుతుందని టెలికాం నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి