అమెరికాలోని మేరీలాండ్ రాష్ట్రం, కొలంబియా నగరంలో తెలుగమ్మాయి నికిత గోడిశాల (27) అనుమానాస్పద పరిస్థితుల్లో హత్యకు గురయ్యారు. ఆమె మృతదేహాన్ని గతంలో తన స్నేహితుడిగా ఉన్న అర్జున్ శర్మ నివసించిన అపార్ట్‌మెంట్‌లో పోలీసులు గుర్తించారు. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న అర్జున్ శర్మ ఘటన వెలుగులోకి రావడానికి ముందే అమెరికా విడిచి భారత్‌కు పారిపోయినట్లు అధికారులు వెల్లడించారు.
నూతన సంవత్సర వేడుకల అనంతరం నికిత కనిపించడం లేదంటూ అర్జున్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డిసెంబర్ 31న ఎల్లికాట్ సిటీలోని తన అపార్ట్‌మెంట్‌లో నికితను చివరిసారిగా చూశానని అతడు పోలీసులకు తెలిపాడు. అయితే, విచారణలో భాగంగా సేకరించిన వివరాల ప్రకారం జనవరి 2వ తేదీన అర్జున్ అమెరికా నుంచి భారత్‌కు వెళ్లినట్లు తేలింది.
ఈ పరిణామాలతో అనుమానం బలపడటంతో పోలీసులు సెర్చ్ వారెంట్ తీసుకుని అర్జున్ అపార్ట్‌మెంట్‌ను తనిఖీ చేశారు. ఆ సమయంలో అక్కడే నికిత మృతదేహం లభ్యమైంది. ఆమె శరీరంపై స్పష్టమైన గాయాలున్నట్లు గుర్తించిన పోలీసులు, డిసెంబర్ 31 రాత్రి 7.30 గంటల తర్వాత నికితను అర్జునే హత్య చేసి ఉండొచ్చని ప్రాథమిక దర్యాప్తులో నిర్ధారించారు. అయితే, ఈ హత్యకు గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదని పోలీసులు పేర్కొన్నారు.
హత్య అనంతరం భారత్‌కు పారిపోయిన అర్జున్ శర్మను గుర్తించి అరెస్టు చేసేందుకు ఫెడరల్ అధికారుల సహకారం కోరినట్లు మేరీలాండ్ పోలీసులు వెల్లడించారు. మరోవైపు, నికిత ఆచూకీ కోసం ఆమె స్నేహితులు సోషల్ మీడియా వేదికగా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అయితే, ఆదివారం ఆమె హత్యకు గురైన విషయం నిర్ధారణ కావడంతో స్నేహితులు, పరిచయస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
సోషల్ మీడియా ఖాతాల ఆధారంగా నికిత కుటుంబ మూలాలు సికింద్రాబాద్‌కు చెందినవిగా తెలుస్తున్నాయి. అయితే, ఆమె భారత్‌లోని ఖచ్చితమైన స్వస్థలం ఏదనే విషయాన్ని అధికారులు ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు.



