కొత్త రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన

telangana-smart-ration-cards-distribution-starts-july-14

తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుదీర్ఘ కాలంగా కార్డుల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూలై 14న తుంగతుర్తిలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

ప్రధానంగా సుమారు 2 లక్షల మంది లబ్ధిదారులకు తొలి విడతలో కార్డులు అందించనున్నారు. ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులు చేసినవారితో పాటు, మీ-సేవ కేంద్రాల ద్వారా చేసిన దరఖాస్తులను అధికారులు సమగ్రంగా పరిశీలించారు. అర్హుల జాబితా ఇప్పటికే సిద్ధమైందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ కార్డుల జారీపై ప్రత్యేక కేబినెట్ సబ్-కమిటీని ఏర్పాటు చేసింది. అర్హతలు, విధానాలపై కమిటీ చేసిన సిఫార్సులను ప్రభుత్వం ఆమోదించింది. దీని ఆధారంగా అర్హుల ఎంపిక ప్రక్రియ చేపట్టి, కార్డుల మంజూరు కార్యక్రమానికి రంగం సిద్ధం చేసింది.

ఈసారి స్మార్ట్ టెక్నాలజీ ఆధారిత కొత్త రేషన్ కార్డులు అందించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ కార్డులు ఏటీఎం కార్డు పరిమాణంలో, రెండు వైపులా ముఖ్యమంత్రి, పౌర సరఫరాల శాఖ మంత్రుల ఫోటోలు, మధ్యలో తెలంగాణ ప్రభుత్వ లోగోతో డిజైన్ చేయబడ్డాయి. వీటిలో బార్ కోడ్ వ్యవస్థను కూడా చేర్చనున్నారు.

ఈ కొత్త విధానంతో రేషన్ పంపిణీలో పారదర్శకత, సామర్థ్యం పెరిగే అవకాశముంది. లబ్ధిదారులందరికీ తక్కువ సమయంలో, సులభంగా సేవలు అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. అర్హులైన వారు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చునని అధికారులు తెలిపారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి