ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు 22 రకాల అవసరమైన వస్తువులతో కూడిన ప్రత్యేక కిట్‌ను అందించేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ కిట్‌ను సమ్మర్ సెలవులు పూర్తయ్యేలోపు పంపిణీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
గురుకుల విద్యార్థులతో పాటు సాధారణ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ ఈ కిట్ అందించనున్నారు. విద్యార్థుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని యూనిఫామ్‌తో పాటు స్కూల్ బ్యాగ్, షూస్, బెల్ట్, టై, నోట్‌బుక్స్ సహా మొత్తం 22 రకాల వస్తువులను ఒకే కిట్‌గా ఇవ్వనున్నారు. విద్యార్థుల విషయంలో ఖర్చుకు వెనకాడాల్సిన అవసరం లేదని, అయితే నాణ్యత విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దని సీఎం స్పష్టం చేశారు.
ఈ అంశంపై సోమవారం సీఎం రేవంత్ రెడ్డి ఎడ్యుకేషన్, వెల్ఫేర్ శాఖల ఉన్నతాధికారులతో సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ అంశంపై సమీక్ష నిర్వహించారు. విద్యార్థులకు అందించే కిట్‌కు సంబంధించి స్పష్టమైన ప్రొక్యూర్మెంట్ ప్లాన్ రూపొందించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్లకు సంబంధించిన పెండింగ్ బిల్లుల పూర్తి వివరాలను వెంటనే సమర్పించాలని ఆదేశించారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని అన్ని పనులు వేగంగా, బాధ్యతతో పూర్తి చేయాలని తెలిపారు.
ఇదే సమయంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణంపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రజాభవన్ నుంచి జిల్లాల కలెక్టర్లు, చీఫ్ సెక్రటరీతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి స్కూళ్ల నిర్మాణ పురోగతిని సమీక్షించారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో పిల్లలను ప్రపంచంతో పోటీ పడేలా తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
టెండర్లు పూర్తైన చోట భూమి పూజ నిర్వహించి, భవనాల నిర్మాణానికి స్పష్టమైన గడువు నిర్ణయించాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రతి వారం స్కూళ్ల నిర్మాణ పురోగతిపై సమీక్ష చేయాలని, నెలలో కనీసం ఒకసారి నిర్మాణ ప్రదేశాన్ని సందర్శించాలని సూచించారు. నిధుల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని, ప్రతి 15 రోజులకు ఒకసారి బిల్లులు విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం భరోసా ఇచ్చారు. నిర్మాణాల్లో నాణ్యతను పర్యవేక్షించేందుకు థర్డ్ పార్టీ ఏజెన్సీని ఏర్పాటు చేయాలని కూడా సూచించారు.


