Telangana Sankranti Holidays 2026: విద్యార్థులకు 7 రోజుల భారీ సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి సంక్రాంతి పండుగ సందర్భంగా భారీ సెలవులు ప్రకటిస్తూ పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ ఇ. నవీన్ నికోలస్ సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

తాజా ఆదేశాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, గురుకులాల పాఠశాలలకు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు వరుసగా సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి. మొత్తం 7 రోజుల పాటు సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అనంతరం జనవరి 17 శనివారం నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి.

అకడమిక్ క్యాలెండర్ ప్రకారం మొదట ఆరు రోజుల సెలవులు మాత్రమే ఉండగా, జనవరి 16న కనుమ పండుగను ఐచ్ఛిక సెలవుగా ప్రభుత్వం గుర్తించింది. అయితే కనుమ పండుగ మరుసటి రోజే కావడంతో, విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని జనవరి 16 వరకూ సెలవులను పొడిగిస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో మరో అదనపు సెలవు కలిపి మొత్తం 7 రోజుల సంక్రాంతి సెలవులు లభించాయి.

ఈ ఉత్తర్వులు రాష్ట్రంలోని అన్ని మేనేజ్‌మెంట్ల పరిధిలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, గురుకుల పాఠశాలలకు వర్తిస్తాయని విద్యాశాఖ స్పష్టం చేసింది. హైదరాబాద్, వరంగల్ ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్లు, అలాగే అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులు (DEOs) ఈ ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలని సూచించింది.

సంక్రాంతి పండుగకు స్వగ్రామాలకు వెళ్లే విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఈ నిర్ణయం ఎంతో ఊరట కలిగించే అంశంగా మారింది. కుటుంబ సభ్యులతో కలిసి పండుగను ఆనందంగా జరుపుకునే అవకాశం లభించిందని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి