ఆన్‌లైన్ బెట్టింగ్ భూతం యువత జీవితాలను నాశనం చేస్తోంది. ఈజీ మనీ కోసం అలవాటు పడ్డ యువకులు అప్పుల ఊబిలో కూరుకుపోయి చివరకు నేరాల బాట పడుతున్నారు. తాజాగా నల్లగొండ జిల్లాలో చోటు చేసుకున్న ఘటన ఈ వాస్తవాన్ని మరోసారి బట్టబయలు చేసింది.
నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలానికి చెందిన వీరబోయిన మహేష్ పత్తి సాగు చేసి, తన పంటను విక్రయించేందుకు ఈ నెల 8న ట్రాక్టర్‌లో లోడ్ చేసి గ్రామంలోనే ప్రదీప్‌రెడ్డి ఇంటి సమీపంలో పార్క్ చేశాడు. అయితే మరుసటి రోజు ఉదయం వచ్చి చూసేసరికి ట్రాక్టర్‌తో పాటు పత్తి లోడు కనిపించకుండా పోయింది. దీంతో బాధిత రైతు మహేష్ కేతేపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా, ఈ చోరీ వెనుక ఆన్‌లైన్ బెట్టింగ్ మోజు బయటపడింది. కేతేపల్లి మండలం భీమారం గ్రామానికి చెందిన నూకల కోటేష్ ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్స్‌కు బానిసయ్యాడు. విలాసాలకు అలవాటు పడిన అతడికి వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయం సరిపోక ఈజీ మనీ కోసం దొంగతనాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు.
ఇప్పటికే 2019లో మాడుగులపల్లి, వేములపల్లి, కేతేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాక్టర్ల చోరీ కేసుల్లో కోటేష్ జైలుకు వెళ్లి వచ్చాడు. అయినప్పటికీ అతనిలో మార్పు రాకపోగా, మళ్లీ బెట్టింగ్ గేమ్స్‌లో డబ్బులు పోగొట్టుకున్నాడు. అప్పులు తీర్చేందుకు సూర్యాపేటకు చెందిన ఆడెపు సాయికుమార్‌తో కలిసి మరోసారి చోరీకి ప్లాన్ వేశాడు.
ఈ నెల 8వ తేదీ రాత్రి వీరబోయిన మహేష్ ట్రాక్టర్‌ను పత్తి లోడుతో సహా దొంగిలించిన నిందితులు, అందులోని కొంత పత్తిని సూర్యాపేట మండలం బాలె గ్రామంలోని కాటన్ మిల్లులో విక్రయించారు. దీనివల్ల వారికి రూ.72 వేల నగదు లభించింది. మిగిలిన పత్తిని కట్టంగూర్ మండలం అయిటిపాములలోని మరో కాటన్ మిల్లుకు తరలిస్తున్న సమయంలో పోలీసులకు చిక్కారు.
కేతేపల్లి మండలం ఇనుపాముల వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టగా, ట్రాక్టర్‌ను ఆపకుండా అనుమానాస్పదంగా వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వెంటనే అడ్డుకుని విచారించగా ఇద్దరు తమ నేరాన్ని అంగీకరించినట్టు నల్లగొండ డీఎస్పీ శివరామిరెడ్డి వెల్లడించారు. నిందితుల నుంచి రూ.50 వేల నగదు, ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్టు తెలిపారు.



