రాజకీయాలలో శాశ్వతమైన స్థానాలు లేవు. పరిస్థితులు, పరిణామాలు నాయకుల భవిష్యత్తును నిర్ణయిస్తాయి. గులాబీ పార్టీలో కవితకు స్థిరమైన స్థానం ఉండేదే. కానీ అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఆమె స్థానం ప్రశ్నార్థకమై, పార్టీ అధిష్ఠానం ఆమెను బయటకు పంపింది. దీంతో కవిత తనకంటూ కొత్త రాజకీయ ప్రయాణం ప్రారంభించాల్సిన అవసరం ఏర్పడింది.
కొత్త పార్టీ ఏర్పాటుపై చర్చలు
తెలంగాణ రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న వార్తల ప్రకారం, కవిత దీపావళి నాటికి తన సొంత పార్టీని ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమె హైదరాబాద్‌లోని తన నివాస ప్రాంతంలో మూడు అంతస్తుల బంగ్లాను అద్దెకు తీసుకుని, అక్కడినుంచి కార్యకలాపాలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఇటీవల జాగృతి సంస్థ ఆధ్వర్యంలో వివిధ జిల్లాల నాయకత్వాన్ని ప్రకటించడం, తెలంగాణ కవులను, కళాకారులను సన్మానించడం వంటి కార్యక్రమాలు ఆమె భవిష్యత్ రాజకీయ ప్రణాళికలకు సంకేతాలుగా కనిపిస్తున్నాయి.
బీసీల హక్కుల కోసం పోరాటం
ఇటీవల కాలంలో కవిత బీసీ రిజర్వేషన్ల కోసం గళం వినిపిస్తున్నారు. తండ్రి నీడ నుంచి బయటకు వచ్చిన ఈ సమయంలో ఆమె తన రాజకీయ లక్ష్యాలను స్పష్టంగా చేసే అవకాశం బలంగా కనిపిస్తోంది. అయితే ఒక పార్టీ నడవాలంటే క్షేత్రస్థాయి నాయకులు, కార్యకర్తలు, బలమైన మద్దతు అవసరం. ఇప్పుడు కవితకు ఇవన్నీ లభిస్తాయా అనేది పెద్ద ప్రశ్న.
ఎవరు ఆమెతో ఉంటారు..?
కవితపై ఇటీవల వచ్చిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలలో చర్చనీయాంశమయ్యాయి. వాటిని గులాబీ పార్టీ నుంచి కేవలం సిరికొండ మధుసూదనాచారి మాత్రమే ఖండించారు. మిగతా నాయకులు స్పందించకపోవడం గమనార్హం. ఇక సోషల్ మీడియాలో కూడా కవితను పలువురు పార్టీ నాయకులు అన్‌ఫాలో చేస్తున్నారు. ఇది ఆమె భవిష్యత్తు రాజకీయ పయనానికి సవాలు అవుతోంది.
ముందు ఉన్న సవాళ్లు
కవిత కొత్త పార్టీ స్థాపిస్తే, ఆమెతో ఎవరు చేరతారు? ఎవరు చివరివరకు నిలుస్తారు? అన్న ప్రశ్నలు ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారాయి. అంతేకాక, ప్రజల్లో నమ్మకం కలిగించడం, క్షేత్రస్థాయి బలం సాధించడం వంటి సవాళ్లు కూడా ఆమె ముందున్నాయి.
రోజులు గడిచేకొద్దీ ఈ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా ఉంది – కవిత కొత్త పార్టీ తెలంగాణ రాజకీయాలలో కొత్త చర్చకు దారి తీస్తుంది.



