అత్యంత పేదల గుర్తింపే లక్ష్యం
పేదరిక నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ఈ క్రమంలో మరింత వెనుకబడిన వర్గాలకు అండగా నిలిచేందుకు కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సచివాలయంలో ఉన్నతాధికారులతో సమావేశమై ఈ కార్యక్రమంపై కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అత్యంత పేద కుటుంబాలను గుర్తించేందుకు ప్రత్యేక సర్వే నిర్వహించాలని సూచించారు.
ఇంటింటి సర్వే ప్రారంభం
ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి సర్వే చేపట్టనున్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఈ సర్వే నిర్వహించనుండగా, తొలుత అత్యంత వెనుకబడిన గ్రామాల్లో ప్రారంభిస్తారు. సర్వే ద్వారా కుటుంబాల జీవన స్థితిగతులు, ఆదాయం, నివాస పరిస్థితులు, ఉపాధి అవకాశాలు వంటి అంశాలను పరిశీలించి పేదలను గుర్తించనున్నారు.
దశలవారీగా ప్రభుత్వ సహాయం
సర్వేలో గుర్తించిన లబ్ధిదారులకు దశలవారీగా ప్రభుత్వ సహాయం అందించనున్నారు.
విద్య, ఉపాధి, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, జీవనోపాధి వంటి రంగాల్లో సమగ్రంగా మద్దతు ఇవ్వనున్నారు. పేద కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం కావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు మంత్రి సీతక్క తెలిపారు.
పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక
లబ్ధిదారుల ఎంపిక పూర్తిగా పారదర్శకంగా జరగనుందని మంత్రి స్పష్టం చేశారు. గ్రామస్థుల సమక్షంలో సమావేశాలు నిర్వహించి, కుటుంబ పరిస్థితులు, ఆదాయ వనరులు, ఉపాధి అవకాశాలను పరిగణనలోకి తీసుకుని అర్హులను ఎంపిక చేయనున్నారు. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమై ఈ కార్యక్రమంపై తుది నిర్ణయం తీసుకుంటామని ఆమె వెల్లడించారు.
పేదలను కేవలం సంక్షేమ పథకాలకే పరిమితం చేయకుండా, వారిని ఆర్థికంగా నిలదొక్కుకునే స్థాయికి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క తెలిపారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ కార్యదర్శి శృతి ఓజా, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్ తదితరులు పాల్గొన్నారు.



