తెలంగాణలో మార్వాడీ గో బ్యాక్ ఉద్యమంపై బండి సంజయ్ స్పందన

మార్వాడీ వ్యాపారులపై కుట్రలు ప్రారంభమయ్యాయి: బండి సంజయ్

హైదరాబాద్‌ యూసుఫ్‌గూడలో జరిగిన బీజేపీ ర్యాలీలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తొలిసారి “మార్వాడీ గో బ్యాక్” ఉద్యమంపై స్పందించారు. ఈ నినాదం వెనుక హిందూ సమాజాన్ని చీల్చే కుట్రలు దాగి ఉన్నాయని ఆయన ఆరోపించారు. కమ్యూనిస్టుల ముసుగులో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం పార్టీలు ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నాయని మండిపడ్డారు.

మార్వాడీలు వ్యాపారం చేస్తే తప్పేముందని ప్రశ్నించిన ఆయన, వారు ఎప్పుడూ అధికారం కోసం పాకులాడలేదని, తెలంగాణను దోచుకోలేదని స్పష్టం చేశారు. వ్యాపారాల ద్వారా సంపదను సృష్టించి, హిందూ సనాతన ధర్మాన్ని కాపాడటానికి పాటుపడుతున్నారని పేర్కొన్నారు. అలాంటి సమాజాన్ని తెలంగాణ నుంచి వెళ్ళిపోమని అడగడం అన్యాయం అని వ్యాఖ్యానించారు. హిందూ కుల వృత్తులను దెబ్బతీసేలా మటన్‌ షాపులు, డ్రై క్లీనింగ్ షాపులు ఒక వర్గం వారే నడుపుతున్నారని కూడా విమర్శించారు.

ఓట్ల చోరీ వల్లే కాంగ్రెస్ గెలిచిందా?

బీజేపీపై ఓట్ల చోరీ ఆరోపణలు చేయడం తప్పు అని బండి సంజయ్ స్పష్టం చేశారు. “ఓట్ల చోరీ జరిగితే కాంగ్రెస్‌ తెలంగాణ, కర్ణాటకలో గెలిచేదా? ఇండి కూటమికి 230 సీట్లు వచ్చాయా? బీజేపీకి కేవలం 240 సీట్లు ఎందుకు వచ్చాయి?” అని ఆయన ప్రశ్నించారు.

యూసుఫ్‌గూడలో బీజేపీ కేంద్ర జిల్లా అధ్యక్షుడు లంకల దీపక్‌ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ర్యాలీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో కలిసి బండి సంజయ్ పాల్గొన్నారు.

రాహుల్ గాంధీ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేసిన ఆయన, “అందుకే కాంగ్రెస్ పరిస్థితి కుక్కలు చింపిన వస్త్రంలా మారింది” అని వ్యాఖ్యానించారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి