తమిళనాడు రోడ్డు ప్రమాదం: బస్సు టైర్ పేలి రెండు కార్లపై దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. 9 మంది మృతి

తమిళనాడులోని కడలూరు జిల్లాలో భయానక రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తిరుచిరాపల్లి నుంచి చెన్నై వైపు వెళ్తున్న తమిళనాడు ప్రభుత్వ ఆర్టీసీ బస్సు టైర్ అకస్మాత్తుగా పేలడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. అదుపుతప్పిన బస్సు ఎదురుగా వస్తున్న రెండు కార్లపైకి దూసుకెళ్లింది. ఈ ఘోర ఘటనలో కార్లలో ప్రయాణిస్తున్న 9 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.

కడలూరు జిల్లా తీత్తకుడి సమీపంలోని తిరుచీ–చెన్నై జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఢీకొన్న తీవ్రతకు కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. కార్లలో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీసేందుకు క్రేన్ సహాయంతో ప్రయత్నాలు కొనసాగించారు.

అలాగే బస్సులో ఉన్న ప్రయాణికులు కూడా ఇటు అటుగా పడిపోవడంతో పలువురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంతో చెన్నై–తిరుచీ జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. మృతులంతా కార్లలో ప్రయాణిస్తున్నవారేనని పోలీసులు స్పష్టం చేశారు. బస్సు టైర్ పంక్చర్ కావడమే ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి